
మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని భివాండి సమీపంలో ముంబై-నాసిక్ హైవేపై బొలెరో వాహనాన్ని కంటైనర్ వేగంగా ఢీకొనడంతో ఆరుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఖదవ్లీ ప్రాంతంలో ప్రయాణికులతో కూడిన బొలెరో వాహనం రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు బొలెరోను ఢీకొట్టి.. కొంత దూరం ఈడ్చుకెళ్లింది.
అయితే ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. కొంతమంది స్థానికులు గాయపడినవారిని భివాండిలోని ఐజీఎం ఆసుపత్రికి, కాల్వాలోని పౌర ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని చిన్మయి వికాస్ షిండే, రియా కిషోర్ పరదేశి, చైతాలి సుశాంత్ పింపుల్, సంతోష్ అనంత్ జాదవ్, వసంత్ ధర్మ జాదవ్, ప్రజ్వల్ శంకర్ ఫిర్కేగా గుర్తించారు. ఇక, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిలో దిలీప్ కుమార్ విశ్వకర్మ, చేతన గణేష్, కునాల్ జ్ఞానేశ్వర్ భామ్రే ఉన్నారు. ఇక, ప్రమాద సమయంలో బొలెరోలో నలుగురు విద్యార్థులు సహా 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మొత్తం అక్కడికి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. బొలెరోను ట్రక్కు ఢీకొట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.