
Heatwave: ఉత్తరప్రదేశ్‌లో మాడుపగిలేలా ఎండలు కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు భీకరంగా పెరిగిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో సగటున 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భయంకర వడగాలులు వీస్తున్నాయి. ఎండల కారణంగా ఒక్క బల్లియా జిల్లాలోనే మూడు రోజుల్లో 54 మంది మరణించారు. మరో 400 మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. వీరి మరణాల వెనుక ఇతర కారణాలు కూడా ఉన్నాయని, కానీ, తీవ్ర ఉష్ణోగ్రతలు మాత్రం కచ్చితంగా అందులో ఒకటి అని వివరించారు.
బల్లియా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో మరణాలు, పేషెంట్‌ల చేరికలు గణనీయంగా పెరిగాయి. ఇందులో చాలా మంది జ్వరం, శ్వాసకోశ సమస్యలు, ఇతర సమస్యలతో హాస్పిటల్‌లో చేరారు.
జూన్ 15వ తేదీన 23 మంది రోగులు మరణించారు. తర్వాతి రోజే 20 మంది, ఆ తర్వాతి రోజు అంటే నిన్న 11 మంది మరణించారని బల్లియా జిల్లా హాస్పిటల్ ఇంచార్జ్ మెడికల్ సూపరింటెండెంట్ ఎస్ కే యాదవ్ వివరించారు.
ఆజంగడ్ సర్కిల్ అదనపు హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బీపీ తివారీ మాట్లాడుతూ.. హాస్పిటల్‌లో అనూహ్యంగా పేషెంట్ల చేరికలు జరుగుతున్నాయని అన్నారు. వీరందరికీ తాము గుర్తించ వీలుకాని డిసీజ్ ఏమైనా సోకిందా అనేది దర్యాప్తు చేయడానికి లక్నో నుంచి ఓ ప్రత్యేక బృందం వస్తున్నదని వివరించారు. శ్వాసకోశ సమస్యలు ఉన్న పేషెంట్లు, డయాబెటిస్ పేషెంట్లు, బీపీ పేషెంట్లకు ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగినా.. తగ్గినా ముప్పే ఉంటుంది. ఈ సారి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం మృతుల సంఖ్య పెరగడానికి కారణమై ఉండొచ్చని డాక్టర్ తివారీ ఊహించారు.
Also Read: ‘ఆపరేషన్ గంగ’.. తిరుగులేని భారత ఆత్మవిశ్వాసానికి తార్కాణం: ఆ డాక్యుమెంటరీపై ప్రధాని మోడీ ట్వీట్
ఈ జిల్లా హాస్పిటల్‌లో పేషెంట్ల సంఖ్య ఎంత ఉధృతంగా ఉన్నదంటే.. అడ్మిట్ కాబోతున్న పేషెంట్లకు స్ట్రెచర్లు కూడాదొరకడం లేదు. చాలా మంది పేషెంట్లను భుజాలపై మోసుకుని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లుతున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను అదనపు హెల్త్ డైరెక్టర్ కొట్టేశారు. ఒకే సమయంలో పది మంది పేషెంట్లు హాస్పిటల్‌లో చేరితే కొంత కష్టమేనని, కానీ, స్ట్రెచర్లు లేవనే విషయాన్ని ఆయన ఖండించారు.