ఆపరేషన్ కావేరీ : 362 మంది భారతీయులతో బెంగళూరులో దిగిన విమానం.. అందులో తమిళనాడు, కర్ణాటక వాసులు

By Siva KodatiFirst Published Apr 28, 2023, 10:34 PM IST
Highlights

సూడాన్ నుంచి 362 మందితో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం సాయంత్రం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఇందులో 52 మంది తమిళనాడు వాసులు, 70 మంది కర్ణాటక వాసులు వున్నారు

ఆర్మీ, పారామిలటరీ బలగాలతో సతమతమవుతున్న సూడాన్‌ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కావేరీ’’ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. తాజాగా 362 మందితో కూడిన ప్రత్యేక విమానం శుక్రవారం సాయంత్రం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఇందులో 52 మంది తమిళనాడు వాసులు, 70 మంది కర్ణాటక వాసులు వున్నారు. 

 

Latest Videos

 

362 మందితో కూడిన సౌదీయా విమానాశ్రయం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారికి ఎయిర్‌పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు వీరిని భారత అధికారులు సూడాన్ నుంచి సౌదీలోని జెడ్డాకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి సౌదీయా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానంలో బెంగళూరుకు తరలించారు. అనంతరం కెంపేగౌడ విమానాశ్రయంలోనే వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వగ్రామాలకు చేరుకున్న వారు కొద్దిరోజులు గృహ నిర్బంధంలో వుండాలని సూచించారు. వీరిలో కొందరు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలకు చెందిన వారు కూడా వున్నారు.

మరోవైపు .. భారత వైమానిక దళానికి చెందిన సీ 17 హెవీ లిఫ్ట్ విమానం న్యూఢిల్లీ విమానాశ్రాయానికి చేరుకుంది. జెడ్డా నుంచి స్వదేశానికి తిరిగి తీసుకురాబడిన మూడవ బ్యాచ్ ఇది. ఇందులో తెలంగాణకు చెందిన 17 మంది ప్రయాణీకులు వున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అధికారులు రవాణా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. 

 

 

మన నౌకలు, విమానాలు భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా వున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. అక్కడ చిక్కుకుపోయిన వారందరికి సహాయం చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఆపరేషన్ కావేరిని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ పర్యవేక్షిస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. సూడాన్‌లో పరిస్ధితి సంక్లిష్టంగా మారుతోందని.. అక్కడ చిక్కుకున్న 3000 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపిన సంగతి తెలిసిందే. 

 

 

కాగా.. సూడాన్‌లో సూపర్ హెర్క్యులస్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించాలని ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. దీనికి అనుగుణంగా పౌరుల తరలింపుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ప్రధాని ఆదేశించారు. గతంలో ఆఫ్గనిస్థాన్ తాలిబాన్ల వశమైన సమయంలోనూ భారతీయుల తరలింపు కోసం భారత్.. అత్యాధునిక సీ 130జే రవాణా విమానాలను వినియోగించిన సంగతి తెలిసిందే. అయితే సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తదితర దేశాలు సూడాన్‌లోని వారి పౌరుల కోసం ప్రారంభించిన ఆపరేషన్ల సందర్భంగా ఇప్పటికే పలువురు భారతీయులు అక్కడి నుంచి బయటపడ్డారు. 
 

click me!