ఆజాద్‌కు మద్ధతుగా కాశ్మీర్ కాంగ్రెస్ శ్రేణులు : నేతలు, కార్యకర్తలు ఆయన వెంటే... హస్తం ఇక ఖాళీయేనా..?

By Siva KodatiFirst Published Aug 30, 2022, 2:25 PM IST
Highlights

గులాంనబీ ఆజాద్‌కు మద్ధతుగా జమ్మూకాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 మంది వరకు నేతలు హస్తం పార్టీని వీడారు. రాబోయే రోజుల్లో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని విశ్లేషకులు అంటున్నారు. 

అసలే కష్టాల్లో వున్న కాంగ్రెస్ పార్టీకి గులాంనబీ ఆజాద్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అధిష్టానం తీరు నచ్చక ఆ పార్టీతో 50 సంవత్సరాల అనుబంధాన్ని ఆయన తెంచుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆజాద్ బాటలోనే మరికొందరు సీనియర్లు నడిచే అవకాశం లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లే గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన నాటి నుంచి నేటి వరకు 64 మంది నేతలు పార్టీని వీడారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి జమ్మూకాశ్మీర్‌లో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆ రాష్ట్రానికి చెందిన 51 మంది నేతలు హస్తం పార్టీకి రాజీనామా చేసి ఆజాద్ పార్టీలో చేరనున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే జమ్మూకశ్మీర్ ఉపముఖ్యమంత్రి తారాచంద్ కూడా కాంగ్రెస్‌ను వీడారు. అలాగే రాబోయే రోజుల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ కార్పోరేటర్లు, బ్లాక్ స్థాయి నాయకులు కాంగ్రెస్‌ను వీడి ఆజాద్‌కు మద్ధతు ప్రకటించారు. పరిస్థితి చూస్తుంటే.. రాబోయే రోజుల్లో కాశ్మీర్‌లో కాంగ్రెస్ ఖాళీ అయ్యే అవకాశాలు వున్నాయని నిపుణులు అంటున్నారు. 

ALso REad:-కాంగ్రెస్‌పై ఆజాద్ మరో దాడి.. రాహుల్‌పై ఘాటు వ్యాఖ్యలు.. ‘మోడీ ఒక సాకు.. ఆ లేఖ రాసినప్పటి నుంచే అసంతృప్తి’

మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే గులాం నబీ ఆజాద్ మరో సారి ఆ పార్టీపై మాటలతో దాడి చేశారు. రాహుల్ గాంధీపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీ 23 నుంచి తాము లేఖ రాశామని, అప్పటి నుంచే తనపై కాంగ్రెస్ అసంతృప్తి ప్రదర్శించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రస్తావన కేవలం ఒక సాకు మాత్రమేనని పేర్కొన్నారు.

జీ 23లో తన పాత్రను కాంగ్రెస్ జీర్ణించుకోలేదని, అప్పటి నుంచే తనను టార్గెట్ చేశారని గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్‌లోని కేవలం సైకోఫాంట్లు మాత్రమే తనను టార్గెట్ చేస్తున్నారని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో క్లోజ్‌గా ఉన్నారని, ఇద్దరికీ లోపాయికారిగా సంబంధం ఉన్నదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను మోడీ పంచన చేరుతున్నట్టు కల్పిత కథలు అల్లుతున్నారని తెలిపారు. నిజానికి ప్రధాని మోడీతో కలిసిపోయింది తాను కాదని.. రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రధాని మోడీని కౌగిలించుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. అందుకే మోడీని కౌగిలించుకున్నది తాను కాదని, రాహుల్ గాంధీ అని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ వారికి ఎవరూ ఇలా లేఖలు రాయాలని కోరుకోదని, వారిని ప్రశ్నించాలని అస్సలు కోరుకోదని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్నో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయని, కానీ, తాము చేసిన సూచనల్లో ఒక్కదానినీ తీసుకోలేదని విమర్శించారు.

click me!