
ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోస్టులకు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు సమాచారం.
సుక్మా, బిజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు శనివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు మావోలు తారసపడటంతో వారిని లొంగిపోవాల్సిందిగా సైన్యం కోరింది.
అయితే నక్సల్స్ కాల్పులు జరపడంతో భద్రతా దళాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్ డీజీ డీఎం అవస్తీ తెలిపారు.
జవాన్ల వైపు ప్రాణనష్టం ఎక్కుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముగ్గురు నక్సల్స్ కూడా ఈ ఘటనలో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఆ ప్రాంతానికి మరింత మంది బలగాలను తరలిస్తున్నారు.
కాగా, గత నెల 23న నారాయణపూర్ జిల్లాలో భద్రతాసిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.