ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఐదుగురు మృతి

By Sumanth KanukulaFirst Published Aug 28, 2022, 10:25 AM IST
Highlights

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఢెంకానల్ జిల్లాలోని కామాఖ్యనగర్ ప్రాంతంలోని పాతరఖంబ చక్ సమీపంలో జాతీయ రహదారి 53పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు. ఢెంకానల్ జిల్లాలోని కామాఖ్యనగర్ ప్రాంతంలోని పాతరఖంబ చక్ సమీపంలో జాతీయ రహదారి 53పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బొగ్గుతో లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు వేగంగా దూసుకొచ్చి ఆటో‌ను ఢీకొట్టిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను ఆదికంద సమాల్, పహలి సమాల్, ఆటో డ్రైవర్ అనంత సమల్, అంకుర్ సమల్, అతని కుమారుడు కలియా సమల్‌గా గుర్తించారు. వీరంతా బంగురా గ్రామానికి చెందినవారు.

నివేదికల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున బాధితులు ముక్తపసి వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక, ఈ ప్రమాదంలో ఆటో కూడా పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్‌, హెల్పర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ప్రమాదం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. మృతుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రమాద స్థలంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ట్రక్కు డ్రైవర్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

click me!