
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో గురువారం నాడు ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.గురువారం నాడు ఉదయం కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు చోటు చేసుకొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇవాళ ఉదయం కార్మికులు విధులకు హాజరైన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది.
బాయిలర్ పేలుడుతో ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. బాయిలర్ వద్ద పని చేసే ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీకి అనుమతి లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు. అనుమతులు లేకుండా ఫ్యాక్టరీని ఎలా నిర్వహిస్తున్నారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబసభ్యులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని తమ వారి కోసం ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.