
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission ) శనివారం షెడ్యూల్‌ను (poll schedule) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు ఎలాంటి రోడ్ షోలు, పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతించడం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. అంతేకాకుండా కఠినమైన సెఫ్టీ గైడ్‌లైన్స్ జారీచేశారు. జనవరి 15 తర్వాత పరిస్థితులను సమీక్షించి ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.
అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అన్నిరకాల రాజకీయ ర్యాలీలపై నిషేధం విధించాలని 41 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. కరోనా నేపథయంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లలో ఎన్నికలను వాయిదా వేయాలని 31 శాతం మంది పౌరులు సర్వేలో తెలిపారు. అన్ని రాజకీయ పార్టీ ర్యాలీపై కోవిడ్ ఆంక్షలు విధించాలని.. వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని 24 శాతం మంది ప్రజలు చెప్పారని సర్వే వెల్లడించింది. ఎన్నికల కారణంగా కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉన్నందు వల్ల ఎలాంటి చర్యలు అవసరం లేదని 4 శాతం మంది చెప్పడం గమనార్హం.
డిజిటల్ కమ్యూనిటీ ఆధారిత ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ (LocalCircles) ఈ సర్వేను నిర్వహించింది. దేశంలోని 309 జిల్లాల్లోని ప్రజల నుంచి 11,000 పైగా స్పందనలు అందాయి. ఇందులో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల నుంచి 4,172 స్పందనలు ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఇక, ఈ సర్వేలో 68 శాతం మంది పురుషులు, 32 శాతం మంది మహిళలు పాల్గొన్నారు.