
భారతదేశ సరిహద్దును కంటి మీద రెప్ప వాల్చకుండా కాపాడతారు సైనికులు (indian army) . ఇందుకోసం ప్రాణాలను సైతం పణంగా పెడతారు. దేశ మాత సేవలో వీరి త్యాగాలు వెలకట్టలేనివి. సరిహద్దులను కాపాడటంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సైనికులు నిస్వార్థం సేవలు చేస్తారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్‌లో (jammu kashmir) మంచు తీవ్రంగా కురుస్తోంది. ఎముకలు కొరికే చలిలోనూ మన జవాన్లు దేశం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఏ చిన్న ఆపద వచ్చినా మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. తాజాగా.. నిండు గర్భిణిని సైనికులు రక్షించారు.
గడ్డకట్టే చలిలో నడిచేందుకే ఇబ్బందిగా వున్న అటవీ ప్రాంతంలో సైనికులు గర్భిణిని (pregnant women) స్ట్రెచర్‌పై మోసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో (shopian district) చోటు చేసుకుంది. ఈ వీడియోను ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ (chinar corps) సైనికులు పోస్ట్ చేశారు.
బారాముల్లా (baramulla kashmir) జిల్లా పరిధిలోని రామ్‌నాగ్రి ఘజ్జర్ లోయలో నెలలు నిండిన గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు సాయంకోసం అభ్యర్థించారు. దీంతో హుటాహుటిన మంచులో బయలుదేరిన చినార్ ఆర్మీకి చెందిన మెడికల్ బృందం.. గర్భిణి ఉన్న ప్రాంతానికి చేరుకొని స్ట్రెచర్ పై సురక్షితంగా తరలించారు. అనంతరం షోపియాన్‌లోని జిల్లా ఆసుపత్రికి చేర్చి వైద్యం అందించారు. ఘజ్జర్ హిల్స్ నుంచి సలాసన్ వరకు మొత్తం 6 కిలోమీటర్ల పాటు గర్భిణిని సైనికులు మోసినట్లు అధికారులు తెలిపారు.
తీవ్రమైన హిమపాతం, ప్రతికూల వాతావరణంలో ఏమాత్రం చలించకుండా నిండు గర్భిణీని కాపాడిన భారత జవాన్లకు స్థానికులు, బాధితురాలి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. మహిళకు పండంటి మగ శిశువుకు జన్మనిచ్చినట్లు చినార్ కార్ప్స్ తెలిపింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సైనికులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.