దేశ రక్షణ కోసం...జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరు తెలుగుజవాన్లు వీరమరణం

By Arun Kumar PFirst Published Nov 9, 2020, 9:20 AM IST
Highlights

జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకునే ప్రయత్నంలో తెలుగు రాష్ట్రాలను చెందిన జవాన్లు వీరమరణం పొందారు. 

శ్రీనగర్: దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రమూకలను అడ్డుకునే క్రమంలో తెలుగురాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. వీరితో పాటు మరో ఇద్దరు జవాన్లు కూడా ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చొరబాటుకు యత్నిస్తుండగా అడ్డుకున్న సైనికులను బలితీసుకున్న ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.  

జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం అనుమానాస్పద కదలికలు గమనించిన భద్రతాదళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నిస్తున్న ఉగ్రమూకను గమనించిన సైనికులు నిలువరించాలని చూశారు. అయితే సైన్యంపై కాల్పులకు తెగబడటంతో సైనికులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. 

ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టింది సైన్యం. వీరిని అడ్డుకునే క్రమంలో బులెట్ గాయాలకు గురయి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందిన మరో సైనికుడు మృతిచెందాడు. వీరితో పాటు  ఓ సైనికాధికారి, మరో బీఎస్‌ఎఫ్‌ జవాను కూడా వీరమరణం పొందారు. 

నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్(26) ఐదేళ్లక్రితం భారత సైన్యంలో చేరాడు. అతడికి రేండెళ్ల క్రితమే సుహాసినితో వివాహమైంది. ఇలా ఇప్పుడిప్పుడే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన అతడు తాజా ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందాడు. అతడి మరణ వార్త తెలిసి కుటుంబంలోనే కాదు గ్రామం మొత్తంలో విషాదం నెలకొంది. 

ఇక చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడి, సుగుణమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(36). అతడు 18 సంవత్సరాలుగా మద్రాస్‌ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న అతడు ఉగ్రవాదుల దాడిలో మృతిచెందాడు.  ప్రవీణ్‌కుమార్‌కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  

click me!