జమ్ము కశ్మీర్‌లో 300 మంది టెర్రరిస్టులు యాక్టివ్‌గా ఉన్నారు: ఆర్మీ కమాండర్

By Mahesh KFirst Published Nov 22, 2022, 7:33 PM IST
Highlights

జమ్ము కశ్మీర్‌లో 300 మంది టెర్రరిస్టులు యాక్టివ్ ఉన్నారని టాప్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని వివరించారు. అప్పటి కంటే ఇప్పుడు ఉగ్రవాదం చాలా వరకు నియంత్రణలోకి తెచ్చామని చెప్పారు.
 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఒకప్పుడు ఉగ్రవాదుల బీభత్సాలతో నెత్తురోడింది. ఇప్పటికీ ఉగ్రదాడులు కొనసాగుతున్నా.. గతంలో కంటే పరిస్థితులు మెరుగయ్యాయని టాప్ ఆర్మీ కమాండర్ మంగళవారం తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో ప్రస్తుతం సుమారు 300 మంది టెర్రరిస్టులు ఉన్నారని అన్నారు. సుమారు మరో 160 మంది సరిహద్దు గుండా పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి చొరబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు పెద్ద ఎత్తున నియంత్రణలోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో మొత్తంగా 300 మంది టెర్రరిస్టులు ఉన్నారని వివరించారు. వారు కూడా ఎలాంటి ఉగ్రబీభత్సాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పూంచ్ లింకప్ డే ప్లాటినం జూబిలీ కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Also Read: సరిహద్దులో పెరుగుతున్న చొరబాటు.. అప్రమత్తమైన బీఎస్ఎఫ్.. ఒకరి హతం..మరొకరి అరెస్ట్

తమ డేటా ప్రకారం 82 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు, 53 మంది స్థానిక ఉగ్రవాదులు మారుమూల ప్రాంతాల్లో ఉన్నారని తెలిపారు. కాగా, ఆందోళనకర ప్రాంతాల్లో మరో 170 మంది ఉన్నారని, వారిని ఇంకా గుర్తించలేదని చెప్పారు.

పాకిస్తాన్ దురాక్రమణలోని జమ్ము కశ్మీర్‌ను భారత్ తిరిగి సాధించుకుంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవలే ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను టాప్ ఆర్మీ కమాండర్ ద్వివేది ముందు ప్రస్తావించగా.. ఇండియన్ ఆర్మీ మేరకు మాట్లాడితే.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఏ ఆదేశాలనైనా శిరసావహిస్తామని తెలిపారు. ఆ ఆదేశాలను అమలు చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని వివరించారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఏ మేరకు కంట్రోల్ చేశారనే దానికి సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని చాలా వరకు నియంత్రణలోకి తెచ్చామని అన్నారు.

click me!