టీకా వేయించుకుని ఇంటికొస్తే... మహిళ తిక్క ప్రవర్తన: ఆరా తీస్తే అది ‘‘రేబిస్’’ వ్యాక్సిన్

By Siva KodatiFirst Published Apr 9, 2021, 6:35 PM IST
Highlights

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే నిన్న ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలోనూ వ్యాక్సినేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే నిన్న ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలోనూ వ్యాక్సినేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని సూచించారు.

అలాగే ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని మోడీ అన్నారు. దీంతో అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 45 సంవత్సరాలు దాటిన పురుషులు, మహిళలకు వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రజల్లో వున్న అపోహలకు తోడు.. కొందరు సిబ్బంది బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుండటం మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. 

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో కరోనా టీకా వేయించుకునేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలకు అక్కడి సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్‌కు బదులుగా రేబిస్‌ టీకా ఇచ్చారు. ఇది తీసుకున్న ముగ్గురిలో ఒకరు అనారోగ్యం పాలవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

షామ్లీ జిల్లాలోని కంధాల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. సరోజ్‌ (70), అనార్కలి (72), సత్యవతి (60) అనే ముగ్గురు మహిళలు కలిసి వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకునేందుకు స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు.

వెంటనే అక్కడి అధికారులు ఒక్కొక్కరితో రూ.10ల సిరంజిలు కొనిపించారు. అనంతరం వారికి వ్యాక్సిన్ వేసి పంపించారు. అయితే టీకా వేయించుకుని ఇంటికి వెళ్లిన సరోజ్‌ మత్తుగా, అసౌకర్యంగా ఉండడంతో పాటు వింతగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు సరోజ్‌కు రేబిస్‌ టీకా వేసినట్టు తెలిపారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబసభ్యులు వ్యాక్సిన్‌ వేసిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా షామ్లీ సిఎంఒ సంజయ్ అగర్వాల్‌కు ఫిర్యాదు చేశారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 

click me!