అడవుల్లోకి వెళ్తున్నారా.. జరభద్రం : అమెరికన్ మహిళకు ఢిల్లీలో అరుదైన సర్జరీ, కంటి నుంచి బొట్‌ఫ్లైస్‌ తొలగింపు

Siva Kodati |  
Published : Feb 22, 2022, 09:42 PM IST
అడవుల్లోకి వెళ్తున్నారా.. జరభద్రం : అమెరికన్ మహిళకు ఢిల్లీలో అరుదైన సర్జరీ, కంటి నుంచి బొట్‌ఫ్లైస్‌ తొలగింపు

సారాంశం

ఢిల్లీ ఆసుపత్రిలోని వైద్యులు 32 ఏళ్ల అమెరికన్‌ మహిళకు అరుదైన మియాసిస్ అనే టిష్యూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి దాదాపు 2 సెం.మీ పరిమాణంలో వున్న మూడు బతికివున్న బొట్‌ ఫ్లైస్‌ను తొలగించారు. వీటిలో ఒకటి కుడి ఎగువ కనురెప్ప నుంచి, రెండవది ఆమె మెడ వెనుక నుంచి, మూడవది ఆమె కుడి ముంజేయి నుంచి తొలగించారు. 

ప్రకృతిని ప్రేమించేవారు ఎందరో. ఒత్తిడి నుంచి సేదతీరేందుకు అడువులకు లేదా పచ్చదనంతో కూడిన అందమైన ప్రదేశాలకు వెళుతూ వుంటారు. ఇంకొందరు ఏ మాత్రం అవకాశం దొరికినా అభయ అరణ్యాలను సందర్శిస్తూ వుంటారు. అయితే అడవుల్లో తిరిగితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌కు గురవడమే కాక ఒక్కొసారి ప్రాణాల మీదకు కూడా వస్తూ వుంటుందట. వినడానికి ఆశ్చర్యంగా వుంది కదూ. కానీ ఇది నిజం. ఇటీవలే అమెజాన్‌ అడవులను సందర్శించిన ఒక మహళకి  మియాసిస్‌ (myiasis) అనే ఒక రకమైన టిష్యూ ఇన్ఫెక్షన్‌ వచ్చింది. ఆమె ట్రీట్‌మెంట్ కోసం భారత్‌కు వచ్చారు. 

వివరాల్లోకి వెళితే... ఢిల్లీ ఆసుపత్రిలోని వైద్యులు 32 ఏళ్ల అమెరికన్‌ మహిళకు అరుదైన మియాసిస్ అనే టిష్యూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆమెకు సోమవారం విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. మియాసిస్(బోట్‌ ఫ్లై) అనేది మానవ కణజాలంలో ఫ్లై లార్వా (మాగ్గోట్)కి (fly larva) సంబంధించిన ఇన్ఫెక్షన్. అయితే ఆమె ఆమెరికాలో ఉండగానే ఈ ఇన్ఫెక్షన్‌ వచ్చిందని చెప్పారు.  అయితే అమెరికన్‌ వైద్యులను సంప్రదించగా.. ఆ రోగ లక్షణానికి సంబంధించిన ఉపశమన మందులు ఇచ్చి పంపించేశారని బాధితురాలు తెలిపారు. అప్పటికి ఊరట లభించినా.. మళ్లీ నాలుగు వారాల నుంచి శరీరంలో ఏదో కదులుతున్నట్లు అనిపించడం, కంటిరెప్పలో వాపు, కళ్లు ఎరుపెక్కడం వంటి సమస్యలతో ఆమె ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు.

సదరు మహిళ ఒక ప్రయాణికురాలు కావడంతో వైద్యులు ట్రావెల్ హిస్టరీని ఆరా తీశారు. ఈ క్రమంలో ఆమె ఇటీవలే అమెజాన్‌ అడువులను (Amazon forest) సందర్శించి వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో మియాసిస్‌ (బోట్‌ ఫ్లై)కి సంబంధించిన కేసుల గురించి వైద్యులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆమె ఇన్ఫక్షన్స్‌కి గల కారణాలను నిర్ధారించారు. అనంతరం వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి దాదాపు 2 సెం.మీ పరిమాణంలో వున్న మూడు బతికివున్న బొట్‌ ఫ్లైస్‌ను తొలగించారు.

వీటిలో ఒకటి కుడి ఎగువ కనురెప్ప నుంచి, రెండవది ఆమె మెడ వెనుక నుంచి, మూడవది ఆమె కుడి ముంజేయి నుంచి తొలగించారు. అంతేకాదు ఎలాంటి అనస్థీషియా లేకుండా అన్ని అస్ప్టిక్ జాగ్రత్తలతో 10-15 నిమిషాల్లో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. మియాసిస్‌(బొట్‌ ఫ్లైస్‌) అనే ఇన్ఫక్షన్‌ ఉష్ణమండల ప్రాంతాలలో నివశించే వారికి వస్తుంది. ఇది ఒక రకమైన పరాన్నజీవి.. అడవులలో చెట్లపై నివసిస్తూ వుంటుంది.

ఇది మానవుని శరీరంలోని సున్నితమైన పొరల్లోకి చొచ్చుకుపోయి మానవ కణజాల వ్యవస్థలను నాశనం చేసి చివరికి ప్రాణాల మీదకి తెస్తుంది. మనదేశంలో, ఇటువంటి కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. దెబ్బలు తగిలి గాయాలైనప్పుడు, అడువుల్లోనూ, దట్టమైన చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ సంచరించినప్పుడూ ఇలాంటి అరుదైన ఇన్ఫెక్షన్‌ల బారినపడుతూ వుంటారని వైద్యులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu