పాతికేళ్లకే గుండెపోటుతో యువత చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి ఓ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది.
న్యూఢిల్లీ : ఘజియాబాద్‌లో ఓ హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. జూ చూడడానికి వచ్చిన ఓ యువ జంట కొద్ది గంటల్లోనే విగతజీవులుగా మారడం తెలిసినవారందరినీ విషాదంలో ముంచేసింది. ఈ భార్యాభర్తలిద్దరూ 24 గంటల లోపే చనిపోయారు. 25 ఏళ్ల అభిషేక్ అహ్లువాలి గుండెపోటుతో మరణించగా, అతని భార్య అంజలి ఆ షాక్ తట్టుకోలేక ఏడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
అభిషేక్, అంజలిలు గత నవంబర్ 30న వివాహం చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం, ఇద్దరూ ఢిల్లీ జంతుప్రదర్శనశాలకు వెళ్లాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఉదయాన్నే జూకు చేరుకున్నారు. అక్కడ సరదాగా జంతువులని చూస్తున్న సమయంలో అభిషేక్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కంగారు పడ్డ అంజలి తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించింది. అభిషేక్ ను మొదట గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడినుంచి వారు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రెఫర్ చేశారని బంధువులు తెలిపారు.
అక్బర్ గొప్పోడు కాడు.. ఓ రేపిస్ట్ - రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు..
అదేరోజు అభిషేక్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గుండెపోటు వల్లే అతను చనిపోయాడని తేల్చారు. ఆ తరువాత అభిషేక్ మృతదేహాన్ని రాత్రి 9 గంటల సమయంలో ఘజియాబాద్‌లోని వైశాలిలోని అహ్ల్కాన్ అపార్ట్‌మెంట్‌లోని వారుంటున్న ఇంటికి తీసుకొచ్చారు. భర్త మరణించాడన్న షాక్ తట్టుకోలేక అంజలి తాముంటున్న ఏడో అంతస్తులోని బాల్కనీలో నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వైశాలిలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచింది.
అభిషేక్ బంధువు బబిత మాట్లాడుతూ.. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంజలి అభిషేక్ పక్కనే కూర్చొని చాలా సేపు ఏడ్చింది. ఆ తరువాత వెంటనే లేచి బాల్కనీ వైపు పరుగెత్తింది. ఆమె దూకుతుందేమో అని అనుమానం వచ్చింది. వెంటనే ఆమె వెనకే పరుగెత్తాను. ఆపండి అని అరుస్తూనే ఉన్నాను.. అంతలోనే ఆమె దూకేసింది" అన్నారు.
అభిషేక్‌ను మొదట జంతుప్రదర్శనశాలకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు మరో బంధువు సంజీవ్ తెలిపారు. "అభిషేక్ ను సఫ్దర్‌జంగ్‌కు తీసుకెళ్లమని వారు చెప్పారు. నేను కూడా అక్కడికి చేరుకున్నాను. డాక్టర్‌తో మాట్లాడాను. వారు తమ శాయశక్తులా ప్రయత్నించారు, కానీ అతన్ని రక్షించలేకపోయారని’’ అతను చెప్పాడు.
25 ఏళ్ల యువకుడి మరణం విషాదాన్ని మిగిల్చింది. చిన్నవయసులో గుండెపోటుకు బలవుతున్న యువకుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకలిగిస్తుంది. గర్బా ఈవెంట్‌లు, పెళ్లి ఊరేగింపులు, జిమ్‌లలో యువకులు కుప్పకూలిపోయి గుండెపోటుతో మరణిస్తున్న అనేక సంఘటనలు గత రెండు సంవత్సరాలుగా వెలుగు చూస్తున్నాయి.