
జీతం విషయంలో యజమానికి, ఉద్యోగికి మధ్య జరిగిన గొడవ తారా స్థాయికి చేరింది. చివరకు ఒకరి ప్రాణం కూడా తీసింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తస్లీమ్(21), యజమాని ఓంప్రకాశ్(45) డెయిరీ ఫామ్ లో రూ.15వేల జీతానికి పనిచేసేవాడు. అయితే.. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయానని.. జీతం తక్కువగా తీసుకోవాలంటూ యజమాని తస్లీమ్ ని కోరాడు. అయితే.. అందుకు తస్లీమ్ అంగీకరించలేదు. దీంతో,.. ఇద్దరి మధ్యా వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓం ప్రకాశ్ ఆవేశంలో తస్లీమ్ ని కొట్టాడు.
యజమాని.. తనపై చెయ్యి చేసుకోవడం తస్లీమ్ కి అవమానంగా అనిపించింది. ఆ రోజు రాత్రి యజమాని నిద్రపోతుండగా.. తలపై కర్రతో కొట్టి దాడి చేశాడు. అనంతరం గొంతు కోసి హత్య చేశాడు, ఆ తర్వాత మృతదేహాన్ని దగ్గరలోని ఓ బావిలో పడేసి పరారయ్యాడు. తర్వాతి రోజు యజమాని బంధువులకు ఫోన్ చేసి తాను వ్యాపార పనిపై ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు చెప్పాడు.
అయితే.. ఓం ప్రకాశ్ ఆచూకీ తెలియకపోవడంతో..అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులకు అతని మృతదేహం బావిలో కనిపించింది. విచారణలో తస్లీమ్ హత్య చేసినట్లు తేలింది. యజమాని బైక్, సెల్ ఫోన్ కూడా తస్లీమ్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు.