పుల్వామా దాడి: ఛార్జీషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ, పాక్ కుట్రపై ఆధారాలు

By Siva KodatiFirst Published Aug 25, 2020, 9:39 PM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్‌షీటును దాఖలు చేసుకుంది. ఉగ్రవాద సంస్థ జైషే అధినేత మసూద్ అజార్ పేరును ఛార్జ్‌షీటులో చేర్చింది.

పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్‌షీటును దాఖలు చేసుకుంది. ఉగ్రవాద సంస్థ జైషే అధినేత మసూద్ అజార్ పేరును ఛార్జ్‌షీటులో చేర్చింది.

ఫిబ్రవరి 14, 2019న చోటు చేసుకున్న ఈ ఆత్మహుతి దాడి కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు కాకుండా మసూద్ అజార్, అతడి సోదరుడు అబ్ధుల్ రవూఫ్ అస్ఘర్ , మరణించిన ఉగ్రవాది మొహమ్మద్ ఉమర్ ఫరూఖ్, ఆత్మహుతి దళ సభ్యుడు అదిల్ అహ్మద్ దార్, అల్వీ, ఇస్మాయిల్ తదితర పాక్ మూలాలు కలిగిన 20 మంది పేర్లు ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్లు తెలిసింది.

26/11 ముంబై దాడులలాంటి కేసుల్లో అజార్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. జమ్మూలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు మొత్తం 13,500 పేజీలతో కూడిన చార్జీషీటును దాఖలు చేశామని, అందులో కేసుకు సంబంధించిన టెక్నికల్, మెటీరియల్, సందర్భోచిత ఆధారాలను పొందు పర్చామని అధికారులు తెలిపారు.

పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ కారులో పేలుడు పదార్ధాలను నింపుకొని, సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డాడు.

కాశ్మీర్ విముక్తి పేరుతో జైషే సాగిస్తోన్న ఉగ్రవాదానికి ఆకర్షితులై ఆదిల్‌తో పాటు జమ్మూకాశ్మీర్‌కు చెందిన పలువురు ఈ దాడుల్లో పాలుపంచుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద భారత ప్రభుత్వం మసూద్ అజార్‌ను టెర్రరిస్టుగా గుర్తించిన సంగతి తెలిసిందే.

సూసైడ్ బాంబర్ ఆదిల్ సహా ఈ కేసులో పలువురు నిందితులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. కాగా గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ హైవేపై సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు అమరవీరులైన సంగతి తెలిసిందే. 

click me!