
డబ్బుల కోసం ఓ ట్యూటర్ ఏకంగా విద్యార్థుల తల్లిదండ్రులనే మోసం చేశాడు. జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ అంటూ వారి వద్దనుంచి డబ్బులు దండుకున్నాడు. తీరా ఆరాతీస్తే అతను గ్లూకోజ్ వాటర్ పిల్లలకు ఎక్కించినట్టుగా తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ విచిత్ర సంఘటన ఢిల్లీలో జరిగింది. వివరాల్లో వెడితే ఢిల్లీ మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలో సందీప్ అనే యువకుడు ఉంటున్నాడు. సందీప్ డిగ్రీ బీఏ సెకండియర్ చదువుతున్నాడు. ఇతను అటు చదువుకుంటూనే ప్యాకెట్ మనీ కోసం చుట్టు పక్కలున్న పిల్లలకు ట్యూషన్లు చెప్పేవారు.
ఈ క్రమంలో ఓ రోజు సందీప్ తన దగ్గర జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్ ఉందని విద్యార్థులకు తెలిపాడు. అంతేకాదు అది తీసుకుంటే మెమరీ పవర్ బాగా పెరుగుతుందని నమ్మించాడు. ఈ మాటలు విన్న పిల్లలు అమాయకంగా నమ్మారు. పిల్లల మాటలతో తల్లిదండ్రులు కూడా నమ్మి పిల్లలకు ఆ ఇంజక్షన్‌ను ఇప్పించేందుకు ఎగబడ్డారు.
అయితే ఓ విద్యార్థి తల్లిదండ్రులకు మాత్రం అనుమానం వచ్చింది. అసలు జ్ఞాపకశక్తి పెంచే అలాంటి ఇంజక్షన్ ఉంటుందా అని అనుమానం వచ్చింది. వెంటనే వారు సందీప్‌ని ఆరా తీశారు. అయితే సందీప్ వాళ్లడిని ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా సెలైన్ వాటర్‌ని విద్యార్థులకు ఇస్తే అది వారి జ్ఞాపకశక్తిని పెంచుతుందని తెలిపాడు.
అంతేకాదు ఈ విషయాన్ని తాను యూ ట్యూబ్ లో చూశానని అందుకే విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచడానికి వారికి సెలైన్ ఇచ్చానని తెలిపాడు. దీంతో షాక్ తిన్న విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులుసందీప్‌పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.