
మూడు దశాబ్ధాల నాటి కేసులో మాజీ క్రికెటర్ , కాంగ్రెస్ (congress) సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకి (navjot singh sidhu) ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు (supreme court) గురువారం తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన శుక్రవారం మధ్యాహ్నం పటియాలాలోని జిల్లా కోర్టు (patiala district court) న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అంతకుముందు ఈ కేసులో తాను లొంగిపోయేందుకు సిద్ధంగా వున్నానని.. కానీ అనారోగ్య కారణాల రీత్యా తనకు కొంత సమయం కావాలని సిద్ధూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ జేబీ పార్ధివాలాలతో కూడిన ధర్మాసనం.. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున సిద్ధూ పిటిషన్‌పై తాము నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
కాగా.. 1988 డిసెంబర్ 27న సిద్ధూ , ఆయన సన్నిహితుడు రూపిందర్ సింగ్ సంధూలు పంజాబ్‌లోని పటియాలాలో రోడ్డు మధ్య తమ కారును ఆపారు. అదే సమయంలో అటుగా వచ్చిన గుర్నాం సింగ్ అనే వృద్ధుడు ఆ వాహనాన్ని పక్కకు తీయమని వారిని కోరాడు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారిద్దరూ వృద్ధుడిని కారులోంచి బయటకు లాగి చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సిద్ధూ, సంధూలు దాడి చేసినట్లు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ 1999లో పటియాల జిల్లా సెషన్స్ కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
Also Read:Navjot Singh Sidhu: సిద్దూ తరువాత నిర్ణయమేమిటి.. లొంగిపోతాడా ? మరో పిటిషన్ దాఖలు చేస్తాడా?
అయితే దీనిపై బాధితులు పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించడంతో సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ 2006లో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీనిని సిద్ధూ సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో అతనికి రూ.1000 జరిమానా విధిస్తూ 2018 మే 15న ధర్మాసంన తీర్పు చెప్పింది. అలాగే ఈ కేసులో సిద్ధూ వెంట వున్న రూపీందర్ సింగ్‌ను సైతం నిర్దోషిగా ప్రకటించింది. అయితే అదే ఏడాది సెప్టెంబర్‌లో మృతుడు గుర్నాంసింగ్ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్ట్ సుదీర్ఘ విచారణ అనంతరం సిద్ధూకి ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.