ఆమెకు 19, అతడికి 17.. పారిపోయి పెళ్లి.. పోక్సో యాక్ట్ కింద యువతి అరెస్ట్.. !

By AN TeluguFirst Published Aug 30, 2021, 3:30 PM IST
Highlights

ఆమె మీద లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల బాలుడిని వివాహం చేసుకుని అతడిని లైంగికంగా వేధించినందుకు ఆమెను అరెస్టు చేశారు.

తమిళనాడులో మైనర్ బాలుడుని వివాహం చేసుకున్న యువతిని సోమవారం  పోలీసులు అరెస్ట్ చేశారు. పొల్లాచిలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి అక్కడికి తరచుగా వచ్చే ఓ 17 అబ్బాయిని పెళ్లి చేసుకుంది.  

ఆమె మీద లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. 17 ఏళ్ల బాలుడిని వివాహం చేసుకుని అతడిని లైంగికంగా వేధించినందుకు ఆమెను అరెస్టు చేశారు.

పోక్సో చట్టంలోని సెక్షన్ 5 (I) (తీవ్ర లైంగిక వేధింపు), సెక్షన్ 6ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కోయంబత్తూరు సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువతి 10 వ తరగతి ఫెయిల్ కావడంతో చదువు ఆపేసి..  పొల్లాచ్చిలోని పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం చేసింది. ప్లస్ 2 పూర్తి చేసిన ఆ యువకుడు పెట్రోల్ బంక్‌కు రెగ్యులర్ గా వస్తుండేవాడు. అలా ఆమెతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. ఆ తరువాత అతనితో దిండిగల్‌కు పారిపోయింది. 

గురువారం దిండిగల్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కోయంబత్తూరుకు తిరిగి వచ్చారు. అక్కడ ఓ అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. ఈ విషయం తెలిసిన బాలుడి తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మీద ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఆ యువతి పొల్లాచిలోని మహిళా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.

కోయంబత్తూర్‌లోని చైల్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ మనోజ్ రఘునాథన్  మాట్లాడుతూ, "ఈ రకమైన కేసులు సాధారణం కాదు. ఇలాంటి సంబంధంలో చొరవ తీసుకునే మహిళలు తక్కువగా ఉంటారు. ఆమెకు, అబ్బాయికి సరైన కౌన్సెలింగ్‌తో ఇవ్వాలి’’ అని అన్నారు. 
 

click me!