ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులతో భారత్‌కు కొత్త సవాళ్లు : కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

By telugu teamFirst Published Aug 30, 2021, 2:59 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిస్థితులు దేశ భద్రతకు కొత్త సవాళ్లను విసిరే ముప్పు ఉన్నదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జాతివిద్రోహ శక్తులు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అవకాశముందని, దీన్ని కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించబోదని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైన ఎదుర్కొనే సామర్థ్యం భారత ప్రభుత్వానికి ఉన్నదని, వాటిని ఎదుర్కోవడానికి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నదని చెప్పారు.

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొంటున్న పరిస్థితులు భారత్‌కు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే, మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు.

పంజాబ్ యూనివర్సిటీ నిర్వహించిన బలరాం జీ దాస్ టాండన్ మూడో స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో దేశ భద్రత అంశంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రసంగించారు. పొరుగుదేశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు సరికొత్త సవాళ్లను లేవనెత్తుతున్నాయని కేంద్ర మంత్రి అన్నారు. భారత దేశ రక్షణ అంశాలకు కొత్త చిక్కులు వచ్చే ముప్పు ఉన్నదని తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిస్థితులన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నదని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నదని చెప్పారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలను ఆసరాగా తీసుకుని సరిహద్దు గుండా జాతివ్యతిరేక శక్తులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నదని కేంద్రంమంత్రి తెలిపారు. దేశ భద్రతపరంగా ఇవి కొత్త సవాళ్లను సృష్టించవచ్చునని తెలిపారు. అయితే, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైనదని, అందుకోసం సంసిద్ధంగానూ ఉన్నదని వెల్లడించారు. ఈ నెల 15న ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు రాజకీయంగా తమ హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.

click me!