నా బలాన్ని చూపిస్తా.. యడియూరప్ప రాష్ట్రవ్యాప్త యాత్రకు ప్లాన్.. బీజేపీ నాయకత్వంలో కంగారు?

By telugu teamFirst Published Aug 30, 2021, 1:47 PM IST
Highlights

కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప రాష్ట్రవ్యాప్తంగా బలప్రదర్శన యాత్రకు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉండగా ఆయన సమాంతరంగా మరో నాయకత్వానికి సిద్ధమవుతున్నారా? అనే ఆందోళనలో బీజేపీ రాష్ట్ర విభాగంలో కలవరం మొదలైంది. ఇదే తరుణంలో కర్ణాటక ఇన్‌చార్జీ అరుణ్ సింగ్ బెంగళూరుకు మూడు రోజుల పర్యటన చేయనుండటం గమనార్హం.
 

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యారు. తాను రాష్ట్రవ్యాప్తంగా టూర్‌కు ప్లాన్ చేసి రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు దారితీశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుండగా సమాంతరంగా మరో నాయకత్వానికి బీజం వేయనున్నారా? అనే ఆందోళన బీజేపీ రాష్ట్ర యూనిట్‌లో నెలకొంది. బీజేపీ హైకమాండ్ మాత్రం ఈ ఇష్యూను స్థానికంగానే పరిష్కరించాలని భావిస్తున్నది. కర్ణాటక ఇన్‌చార్జీ బీజేపీ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ ఇదే తరుణంలో బెంగళూరుకు వస్తుండటం గమనార్హం.

యడియూరప్ప తన రాజకీయ జీవితంలో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నవే ఎక్కువ. వాటి ద్వారా ఒక్కోసారి వివాదాల్లోనూ చిక్కుకున్నారు. పార్టీ నుంచే వ్యతిరేకత వచ్చినప్పుడ బయటికి వచ్చి సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నాడు. విజయవంతం కాకపోవడంతో మళ్లీ బీజేపీలోకే చేరారు. సీఎం కుర్చీ కోసం తపన పడి ఆ పీఠాన్ని అధిరోహించారు. ఎప్పుడు సీఎం పీఠాన్ని అధిరోహించినా.. కత్తిమీద సాము చేసే పరిస్థితులే ఆయనకు ఎదురయ్యాయి. తాజాగా ఆర్థిక సమస్యలు, కరోనా సంకట పరిస్థితుల మధ్యలోనే సీఎం సీటును మధ్యలోవదిలేయాల్సి వచ్చింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత ఆయన రాజీనామా చేసి తప్పుకున్నారు.

మాల్దీవుల పర్యటన నుంచి తిరిగి వచ్చిన యడియూరప్ప రాగానే గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్పతో శివమొగ్గలో భేటీ అయ్యారు. యడియూరప్పపై తిరుగుబాటు చేసి మంత్రుల్లో ఈశ్వరప్ప తొలివాడు కావడం గమనార్హం. అనంతరం, రాష్ట్రవ్యాప్తంగా బలప్రదర్శన యాత్ర చేయడానికి సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఆయన బలాన్ని చూపెట్టుకోవాలనే లక్ష్యంతో ఈ టూర్ చేయనున్నట్టు తెలిపారు.

యడియూరప్ప అధికారంలో ఉన్నప్పుడు తన కొడుకు బీవై విజయేంద్ర కెరీర్‌ను ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. తాజాగా, ఈ యాత్ర ద్వారా తన బలాన్ని నిరూపించుకోవడంతోపాటు కుమారుడు విజయేంద్రనూ బలంగా ప్రొజెక్ట్ చేయాలనే ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లోపు విజయేంద్రను బలమైన నాయకుడిగా నిలబెట్టాలని యడియూరప్ప భావిస్తున్నారు. ఇప్పటి వరకు మినిస్టర్ బెర్త్ కోసం విజయేంద్ర చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. కాబట్టి, ఆయన కూడా కసి మీద ఉన్నట్టు తెలుస్తున్నది. 

యడియూరప్ప టూర్‌పై బీజేపీ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్ స్పందించారు. యడియూరప్ప చాలా అనుభవమున్న నేత అని అన్నారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా టూర్ చేపట్టాలనుకుంటే అలాగే చేయనిస్తామని తెలిపారు. ఆయన యాత్ర ద్వారా పార్టీకే లబ్ది చేకూరుతుందని వివరించారు. యడియూరప్ప ప్లాన్‌పై బీజేపీలో కంగారేమీ లేదని అరుణ్ సింగ్ స్పష్టం చేశారు.

click me!