Haryana Hooch tragedy : హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 18 మంది మరణించారు. ఈ ఘటనకు కారణమయ్యారని భావిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మరణాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిందించాయి.
Haryana Hooch tragedy : కల్తీ మద్యం తాగి 18 మంది మృతి చెందిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. యమునానగర్, దానికి పొరుగున ఉన్న అంబాలా జిల్లాలోని మండేబరి, పంజేటో కా మజ్రా, ఫూస్గఢ్, శరణ్ గ్రామాల్లో ఈ మరణాలు సంభవించాయి. ఇందులో గత 24 గంటల్లో యమునానగర్ లో ఆరుగురు మరణించారు. అంతకుముందు కల్తీ మద్యం తాగి 10 మంది చనిపోయారు. తరువాత అంబాలాలో ఇద్దరు మరణించారని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం పేర్కొంది.
కాగా.. కల్తీ మద్యం సేవించిన ఘటనలో బుధవారం మొదటి మరణం సంభవించిందని యమునానగర్ ఎస్పీ గంగా రామ్ పునియా తెలిపారు. దీనిపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టామని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’కి తెలిపారు. ఈ మరణాలకు కారణమైన వారిలో ఇప్పటి వరకు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత మందిని అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
యమునానగర్ లోని ఓ పాడుబడిన కర్మాగారంలో తయారు చేసిన 200 క్రేట్ల కల్తీ మద్యాన్ని, 14 ఖాళీ డ్రమ్ములు, అక్రమ మద్యం తయారీకి ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 308 (హత్యాయత్నం), 302 (హత్య), 120 బీ (నేరపూరిత కుట్ర), పంజాబ్ ఎక్సైజ్ (హర్యానా సవరణ బిల్లు), పంజాబ్ ఎక్సైజ్ చట్టం, కాపీరైట్ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఇదిలావుండగా.. ఈ మరణాలపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. బీజేపీ-జేజేపీ ప్రభుత్వ అండదండలతో బ్లాక్ డ్రగ్ వ్యాపారం విస్తరిస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ఆరోపించారు. విషపూరిత మద్యం, చిట్టా, సింథటిక్ డ్రగ్స్ రాష్ట్ర ప్రజలను నిరంతరం చంపేస్తున్నాయన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సుశీల్ గుప్తా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రతీ వీధిలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బ్రాండెడ్ బాటిళ్లలో కల్తీ మద్యాన్ని విక్రయించే వ్యాపారం కూడా బహిరంగంగానే జరుగుతోందని ఆరోపించారు.