ఖరీఫ్ సీజన్‌లో రైతులు MSPతో రూ. 57 వేల కోట్ల లబ్ది పొందారన్న కేంద్రం.. ఏపీ, తెలంగాణలో డేటా ఇలా..

By team teluguFirst Published Dec 2, 2021, 3:11 PM IST
Highlights

ఖరీఫ్ సీజన్‌లో(Kharif season) వరి ధాన్యం కొనుగోలు (paddy procurement) ప్రక్రియ సాఫీగానే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2021-22 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు వరి ధాన్యాన్ని గతేడాది మాదిరిగానే కొనుగోలు చేస్తున్నట్టుగా పేర్కొంది. 

ఖరీఫ్ సీజన్‌లో(Kharif season) వరి ధాన్యం కొనుగోలు (paddy procurement) ప్రక్రియ సాఫీగానే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2021-22 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో రైతుల నుంచి కనీస మద్దతు ధరకు వరి ధాన్యాన్ని గతేడాది మాదిరిగానే కొనుగోలు చేస్తున్నట్టుగా పేర్కొంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు దాదాపు 18.17 లక్షల మంది రైతులు రూ. 57,032.03 కోట్ల కనీస మద్దతు ధర ప్రయోజనం (MSP benefit) పొందారు. 2021-22 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌లో నవంబర్ 30 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, చంఢీఘర్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌ల నుంచి  290.98 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్టుగా ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కేంద్ర గణంకాల ప్రకారం.. పంజాబ్ నుంచి గరిష్ఠంగా 1,86,85,532 మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు. ఇక్కడ 9,24,299 మంది రైతులు రూ. 36623.64 కోట్ల కనీస మద్దతు ధర ప్రయోజనం పొందారు. 55,30,596 మెట్రిక్ టన్నుల వరి సేకరణతో హర్యానా ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఇక్కడ 2,99,777 మంది రైతులు రూ. 10839.97 కోట్ల కనీస మద్దతు ధర ప్రయోజనం పొందారు. 

ఇక, తెలంగాణ విషయానికి వస్తే నవంబర్ 30 నాటికి.. 16,13,982 మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు. ఇక్కడ 2,27,939 మంది రైతులు రూ. 3163.40 కోట్ల కనీస మద్దతు ధర ప్రయోజనం పొందారు. ఏపీలో 62,266 మెట్రిక్ టన్నుల వరిని సేకరించారు. ఇక్కడ 4,455 మంది రైతులు రూ. 122.04 కోట్ల కనీస మద్దతు ధర ప్రయోజనం పొందారు. 

ఇక, 2020-21లో సేకరణను పరిగణనలోకి తీసుకుంటే.. 8,94,19,081 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు(నవంబర్ 30 నాటికి). ఆ సీజన్‌లో 1,31,13,417 మంది రైతులు కనీస మద్దతు ధర రూ. 1,68,823.23 కోట్లు ప్రయోజం పొందారని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది.

వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత కూడా రైతు సంఘాలు తమ నిరసనను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వారు కనీస మద్దతు ధరకు చట్టబద్దతను డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంఎస్‌పీపై ఏర్పాటు చేసే కమిటీకి ఐదుగురు సభ్యుల పేర్లను సూచించాలని కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలను కోరిందని.. సంయుక్త కిసాన్ మోర్చా సభ్యుడు హరీందర్ సింగ్ లఖోవాల్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. రైతులను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ఈ డేటాను వినియోగించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది

click me!