
మహారాష్ట్రలోని కాల్వలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మెమోరియల్ (సీఎస్‌ఎంఎం) ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 17 మంది రోగులు మరణించారు. అయితే ఆగస్ట్ 10న ఒకే రోజులో ఐదుగురు రోగులు మరణించారు. అయితే తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకోవడంపై ప్రజలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ఎంఎం ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ స్పందించారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆసుపత్రి డీన్‌ను కోరినట్లు తెలిపారు.
‘‘ఈ 17 మందిలో మొత్తం 13 మంది ఐసియులో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఐదుగురు రోగులు ఆసుపత్రిలో మరణించారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం డీన్‌ను కోరింది’’ అని తాజాజీ సావంత్ విలేకరుల సమావేశంలో చెప్పారు. డీన్ నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ ఆసుపత్రి రాష్ట్ర వైద్య విద్య, పరిశోధన విభాగం కిందకు వస్తుందని.. ఇప్పటికే సంబంధిత మంత్రి ఆస్పత్రికి చేరుకున్నారని చెప్పారు.
ఇక, మరణించిన వారిలో ఎక్కువ మంది రోగులు ఐసీయూలో చేరారని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి. అయితే సీఎస్ఎంఎం ఆసుపత్రి అధికారులు ఖచ్చితమైన సంఖ్యను ఇంకా ధృవీకరించలేదు. మరణించిన రోగులలో చాలా మంది వృద్ధులు, పరిస్థితి విషమంగా ఉన్నావారేనని చెబుతున్నారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గణేష్ గావ్డే పిటిఐతో మాట్లాడుతూ.. ‘‘గత 24 గంటల్లో 17 మంది మరణించినట్లు మాకు సమాచారం ఉంది. రోజుకు సాధారణ సంఖ్య ఆరు నుండి ఏడు అని మాకు చెప్పబడింది. కొందరు రోగులు క్రిటికల్ స్టేజ్‌లో ఉన్నారని.. చికిత్స పొందుతూ మరణించారని ఆసుపత్రి యాజమాన్యం మాకు తెలిపింది. ఈ అధిక సంఖ్యలో మరణాల కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మేము ఆసుపత్రిలో పోలీసు భద్రతను పెంచాం’’ అని చెప్పారు.