ఎరాస్మస్ ముండస్ స్కాలర్‌షిప్‌ గెలిచిన 161 మంది భారతీయ విద్యార్ధులు.. వరుసగా రెండో ఏడాది మనదే అగ్రస్థానం

By Siva KodatiFirst Published Jul 7, 2022, 8:49 PM IST
Highlights

2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రారంభమయ్యే డిగ్రీ కోర్సులకు సంబంధించి 161 మంది భారతీయ విద్యార్ధులు ప్రతిష్టాత్మక ఎరాస్మస్ ముండస్ స్కాలర్‌షిప్‌లను పొందారు. వీరిలో 88 మంది మహిళలే కావడం విశేషం

2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రారంభమయ్యే డిగ్రీ కోర్సులకు సంబంధించి 161 మంది భారతీయ విద్యార్ధులు ప్రతిష్టాత్మక ఎరాస్మస్ ముండస్ స్కాలర్‌షిప్‌లను పొందారు. వీరిలో 88 మంది మహిళలే కావడం విశేషం. తద్వారా 167 దేశాల జాబితాలో అత్యధిక స్కాలర్‌షిప్‌లు పొంది భారత్ వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. 

దీనికి గుర్తుగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం భారతదేశంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈయూ అనుబంధ ఎరాస్మస్ + ప్రోగ్రామ్ ద్వారా .. ఎరాస్మస్ ముండస్ జాయింట్ మాస్టర్ డిగ్రీ (ఈఎంజేఎండీ)కి నిధులు అందజేస్తారు. ఈ స్కాలర్‌షిప్ పొందిన భారతీయ విద్యార్ధులు తమ ఉన్నత చదువుల కోసం త్వరలో యూరప్ కు బయల్దేరనున్నారు. 

Latest Videos

ఈ సందర్భంగా విద్యార్ధులను అభినందించారు భారత్, భూటాన్ లలోని ఈయూ రాయబారి ఉగో అస్టుటో. ఇప్పటి వరకు 6000 మందికి పైగా భారతీయ విద్యార్ధులు, విద్యార్ధులు ఎరాస్మస్ ముండస్ స్కాలర్‌షిప్ ద్వారా లబ్ధిపొందారని ఆయన తెలిపారు. తద్వారా వారు భారత్ ను రెండు సంవత్సరాల పాటు అగ్రగామిగా నిలిపారని అస్టుటో ప్రశంసించారు. ఈయూ- భారత్ మధ్య పెరుగుతున్న ప్రజల అనుసంధానానికి ఇది నిదర్శనమన్నారు. ఎరాస్మస్ + స్కాలర్‌షిప్‌లు వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్దికి జీవితకాల అవకాశాన్ని అందిస్తాయని అస్టుటో చెప్పారు. విద్యార్ధుల నైపుణ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. ఐరోపా వైవిద్యాన్ని దృష్టిలో పెట్టుకుని గొప్ప సాంస్కృతిక అనుభవాన్ని పొందేలా దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉత్తేజకరమైన, సుసంపన్నమైన ప్రయాణాన్ని ప్రారంభించినందుకు తాను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అస్టుటో చెప్పారు. 

 

ఎరాస్మస్ ముండస్ 2022-2024 బ్యాచ్‌కు ఎంపికైన భారతీయ విద్యార్థులు వివిధ యూరోపియన్ దేశాలలో ఉన్న కనీసం రెండు విశ్వవిద్యాలయాలలో అధ్యయనం , పరిశోధనలు నిర్వహించి ఉమ్మడి లేదా డబుల్ లేదా బహుళ డిగ్రీలు పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్ పొందిన వారి ప్రయాణ ఖర్చులు, జీవన భత్యాన్ని ఈయూనే చెల్లిస్తుంది. ఇకపోతే.. యూరప్ లో ప్రస్తుతం 400కు పైగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వున్నాయి. ఉన్నత స్థాయి పరిశోధనా సంస్థల నుంచి, చిన్న, బోధన, కేంద్రీకృత కళాశాలలు వున్నాయి. వీటిలో 17 మిలియన్ల మంది విద్యార్ధులు , 4,35,000 మంది పరిశోధకులు, 1.5 మిలియన్ల మంది విద్యావేత్తలు వున్నారు. 

ఇకపోతే.. ఈ ఏడాది భారత్ లోని 19 రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు ఎరాస్మస్ ముండస్ స్కాలర్‌షిప్‌ను పొందారు. వీరిలో చాలా మంది ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన వారే. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫ్రాన్స్ (34), ఇటలీ (23), బెల్జియం (20), ఫిన్లాండ్ (10), స్పెయిన్ (11), యునైటెడ్ కింగ్‌డమ్ (10), పోర్చుగల్ (  08), నెదర్లాండ్స్ (05), జర్మనీ (07), పోలాండ్ (06), స్వీడన్ (06), ఆస్ట్రియా (07), డెన్మార్క్ (03), ఐర్లాండ్ (02), హంగరీ (03), చెక్ రిపబ్లిక్ (02) మరియు  గ్రీస్ (01), నార్వే (01,  ఈజిప్ట్ ఇద్దరు భారతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

ఇంజనీరింగ్, నేచురల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఐసీటీ, గ్రీన్ టెక్నాలజీ, సర్క్యూలర్ ఎకానమీ, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఇంటర్నేషనల్ లా వంటి కోర్సులను భారతీయ విద్యార్ధులు ఎంచుకున్నారు. ఈయూ-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో వున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ కోర్సులు వుండనున్నాయి. భారత్ - ఈయూ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 60 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. గడిచిన 60 ఏళ్లలో భారత్ లో పేదరికాన్ని తగ్గించేందుకు, విపత్తులను నివారించడానికి, వాణిజ్పయాన్ని విస్తరించడానికి, ప్రపంచ భద్రత, శక్తి, ఆరోగ్యం, వ్యవసాయం, ఉమ్మడి పరిశోధనలకు సంబంధించి ఈయూ తోడ్పడింది. ఇకపోతే..  2021లో, 153 మంది భారతీయ విద్యార్థులు ఎరాస్మస్ ముండస్ స్కాలర్‌షిప్‌లను అందుకున్నారు.

ఇంతకీ ఈయూ-ఎరాస్మస్ ప్రోగ్రామ్ అంటే:

Erasmus అంటే.. యూనివర్శిటీ స్టూడెంట్స్ మొబిలిటీ కోసం యూరోపియన్ రీజియన్ యాక్షన్ స్కీమ్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విద్యకు మాత్రమే కాకుండా భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి యూరోపియన్ యూనియన్ ద్వారా 1987లో స్థాపించబడిన కార్యక్రమం. యూనివర్సిటీలు, దేశాల మధ్య ఈ ప్రోగ్రామ్ కింద విద్య, శిక్షణ, క్రీడలకు సహకారం అందిస్తారు. 2022లో ఎరాస్మస్ + ప్రోగ్రామ్ 35వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. 2021-27 మధ్యకాలానికి గాను 26.2 బిలియన్ యూరోలు (భారత కరెన్సీలో రూ.2,096,94 కోట్లు) బడ్జెట్‌ను ఈ కార్యక్రమం కోసం కేటాయించారు. 
 

click me!