
LPG cylinder price hike: దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ ధరల మంటలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. గ్యాస్ బండలను భరించలేము మహాప్రభో.. ధరలు తగ్గించండి అంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. మరికొంత మంది పెరిగిన ధరలతో మళ్లీ గ్యాస్ సిలిండర్లలను నింపుకునే స్థితిలో లేమంటూ కట్టెల పొయ్యికి మారుతున్నారు. దేశంలో అత్యధికంగా ఉజ్వల పథకం కింద ఎల్ పీజీ సిలిండర్లు పొందిన ఉత్తరప్రదేశల్ లోని లబ్డిదారులు కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను పక్కనపడేసి పాత పద్దతులకు మారుతున్నారు.
ప్రస్తుతం అందుతున్న దేశ మీడియా రిపోర్టుల ప్రకారం.. కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పడిన తర్వాత పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల ధరలు సైతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తన మొదటి పర్యాయంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. దీని కింద పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించే కార్యక్రమాలు చేపట్టింది. కొంతవరకు అర్హులైన కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. అయితే ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంతో, వీటిలో చాలా కుటుంబాలు తమ సిలిండర్లను రీఫిల్ చేసుకోలేకపోతున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రీఫిల్ సిలిండర్ల రిపోర్టులు ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నాయి.
మళ్లీ కట్టెల పొయ్యే దిక్కు..
దేశంలో ఉజ్వత పథకం కింద ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు పొందిన రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ముందుంది. అయితే, ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ప్రయోజనం పొందిన తర్వాత కూడా అనేక కుటుంబాలు LPG సిలిండర్ గ్యాస్ స్టవ్‌పై వంట చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. "30 ఏళ్ల నీలం 2016లో కనెక్షన్ పొందింది, కానీ ఇప్పుడు ఆమె గత 6 నెలలుగా గ్యాస్ రీఫిల్ చేయలేకపోయింది. ఎల్ పీజీ గ్యాస్‌కు తక్కువ ఆదాయం.. అధిక ధర అనే తేడాను పూడ్చలేమని ఆమె అన్నారు. ఇన్నాళ్లు వంట చేసిన చోటే మళ్లీ వస్తానని అనుకోలేదని తన బాధను పంచుకుంది. మళ్లీ కట్టెల పొయ్యికి మారిన విషయాన్ని పంచుకుంది" అని ఇండియా టూడే నివేదించింది. అలాగే, దాదాపు ఏడాది క్రితం భర్తను కోల్పోయిన 50 ఏళ్ల చంపా దేవి తన పిల్లలను స్వయంగా పోషిస్తోంది. అయితే, ప్రస్తుత ధరల పెరుగుదల కారణంగా ఎల్‌పీజీ సిలిండర్ కొనుగోలు చేయలేక పోతోంది. ముజఫర్‌నగర్ జిల్లాలో,ఈ పథకం కింద ఉన్న ఇద్దరు మహిళా లబ్ధిదారులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. పథకం కింద అందిన సిలిండర్లు చాలా కాలంగా నిరుపయోగంగా ఉండడంతో మహిళలు పాత పద్ధతిలోనే కట్టెలు వెలిగించి వంటలు చేస్తున్నారు.
ఎప్పుడూ లేనంతగా LPG ధరల పెంపు
దేశీయంగా 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర బుధవారం మరోసారి రూ.50 పెరిగింది. దేశీయ LPG సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1053 గా ఉండగా, చాలా రాష్ట్రాల్లో రూ,1100 దాటింది. మే నుంచి ఎల్‌పీజీ ధరలు పెరగడం ఇది మూడోసారి కాగా, ఈ ఏడాది నాలుగోది. తాజా పెంపునకు ముందు, దేశీయ ఎల్‌పిజి ధరలు చివరిసారిగా మే 19న సిలిండర్‌కు రూ.3.50 చొప్పున పెరిగాయి.
ఉజ్జ్వల పథకం
'ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన' (PMUY)' పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 1, 2016న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ఎల్ పీజీ కనెక్షన్‌లను అందజేయడం ద్వారా ఆగస్టు 10న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన రెండవ దశ ఉజ్వల 2.0ని ప్రధాని మోడీ ప్రారంభించారు. సాంప్రదాయ వంట ఇంధనాలైన కట్టెలు, బొగ్గు, ఆవు-పేడతో చేసిన పిడకలు ఉపయోగిస్తున్న గ్రామీణ, వెనుకబడిన కుటుంబాలకు ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.