లోయలో పడిన వాహనం...16మంది దుర్మరణం

By telugu teamFirst Published Nov 13, 2019, 8:23 AM IST
Highlights

ఈ ఘటనలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడికి ముందుగా స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించామని దోడా జిల్లా ఎస్పీ ముంతాజ్ అహ్మద్ తెలిపారు. 

జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో.. ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు కూడా దుర్మరణం చెందారు. దోడ జిల్లాలోని మర్మాత్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో.. 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మరో నలుగురు చికిత్స పొందుతూ చనిపోయారు.

దోడా జిల్లా మర్మాట్ ప్రాంతంలోని గోవా గ్రామం మలుపు వద్ద డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేక పోయాడు. దీంతో వాహనం 700 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడికి ముందుగా స్థానికంగా ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మూలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించామని దోడా జిల్లా ఎస్పీ ముంతాజ్ అహ్మద్ తెలిపారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు.

ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం పట్ల జమ్మూ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.

click me!