
ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూరప్ దేశాలతో పాటుగా, అమెరికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. భారత్‌లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇటలీ నుంచి విమానంలో భారత్‌కు చేరుకన్న ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా అందులో 125 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు. వివరాలు.. ఇటలీలోని మిలాన్ నుంచి పోర్చుగీస్ కంపెనీ EuroAtlantic Airwaysకు చెందిన చార్టర్ ఫ్లైట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో (Milan-Amritsar charter flight) ల్యాండ్ అయింది.
ఆ విమానంలో 19 మంది పిల్లలతో సహా 179 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇటలీ ఎట్ రిస్క్ జాబితాలోని దేశం కావడంతో.. ఆ ఫ్లైట్‌లో వచ్చిన పెద్దలందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పిల్లలను మినహాయించి.. మిగిలిన 160 మందికి RT-PCR టెస్ట్ చేసినట్టుగా అధికారులు తెలిపారు. వారిలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టుగా వెల్లడించారు. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలినవారిని ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు తరలించనున్నారు.
ఈ ఘటనతో పంజాబ్ వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక, పంజాబ్‌లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం పంజాబ్‌లో కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదు కాగా, నలుగురు మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,08,723కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య కి చేరింది. ప్రస్తుతం అక్కడ 4,434 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అది ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాదు..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోఅమృత్‌సర్‌కు చేరుకున్న వారికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయిందనే ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. ‘ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో రోమ్ నుంచి అమృత్‌సర్ వచ్చిన ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టుగా కొన్ని మీడయా సంస్థలు రిపోర్ట్ చేశాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. అవి నిరాధారమైనవి. ఎయిర్ ఇండియా ప్రస్తుతం రోమ్‌కు ఎలాంటి ఫ్లైట్ సర్వీసులను నడపడం లేదు’ అని Air India ట్వీట్ చేసింది.
ఇక, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఎట్ రిస్క్ దేశాల నుంచి భారత్ చేరుకునే ప్రయాణికులందరికీ ఎయిర్‌పోర్ట్‌లలో పరీక్షల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఎట్ రిస్క్ దేశాల జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే వారికి కూడా ర్యాండమ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
భారత్‌లో కోవిడ్ విజృంభణ..
భారత్‌లో మరోసారి రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,928 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 325 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,82,876కి చేరింది. నిన్న దేశంలో కరోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,43,41,009కి చేరంది. ప్రస్తుతం దేశంలో 2,85,401 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 97.81 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉందని పేర్కొంది. వీక్లీ పాజిటివ్ రేటు 3.47 శాతంగా ఉన్నట్టుగా వెల్లడించింది. దేశంలో బుధవారం మరో 91,25,099 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,48,67,80,227కి చేరింది.