
అస్సాం : ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు మాత్రం రక్షణ దక్కడం లేదు. కామాంధుల చేతిలో అమాయక మహిళలు, ముక్కుపచ్చలారని చిన్నారులు నలిగిపోతూనే వున్నారు. ఇలా అభం శుభం తెలియని ఓ పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. కోరిక తీర్చుకున్నాక ఎక్కడ బాలిక విషయం భయటపెడుతుందోనని భయపడి అతి కిరాతకంగా ఆమెను హతమార్చాడు. ఈ అమానుష ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలోని తిన్‌సుకియా జిల్లా మార్గరీటా ప్రాంతంలో అనన్ భార్యతో కలిసి నివాసముండేవాడు. అదే ప్రాంతానికి చెందిన 12ఏళ్ల బాలిక తరచూ వీరి ఇంటివైపు వస్తుండేది. దీంతో ఆమెపై అనన్ కన్ను పడింది. ఎలాగయినా ఆ చిన్నారిని అనుభవించాలని అతడు అదునుకోసం ఎదురుచూసాడు. గత మంగళవారం అతడికి చిన్నారి ఒంటరిగా కనిపించడంతో దారుణానికి ఒడిగట్టాడు.
చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లిన అనన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృతచేష్టలతో భయపడిపోయిన బాలిక ఏడవడం చూసి ఎక్కడ ఈ విషయం భయటపెడుతుందోనని భయపడిపోయిన అతడు మరో దారుణానికి పాల్పడ్డాడు. బాలికను చంపేసి ఆ మృతదేహాన్ని ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో పడేసి పరారయ్యాడు.
Read More డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో దంపతుల అరెస్ట్.. పెళ్లైనా తర్వాత కూడా కొనసాగిన బంధం.. చివరకు ఇలా..
తమ కూతురు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా అనన్ ఇంటి సెప్టిక్ ట్యాంక్ లో మృతదేహం లభించింది. అప్పటికే అనన్ పరారీలో వుండటంతో అతడిని పట్టుకుని శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేస్తూ బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ హత్యాచారం ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ లో నిందితుడు అనన్ పట్టుబడ్డాడు.
అయితే అస్సాంకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుల నుండి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించాడు. దీంతో అనన్ ను వెంబడించిన పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని పోలీసులు స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసిన నిందితున్ని ఎన్కౌంటర్ చేయాలన్న స్థానికులు డిమాండ్ చేయడంవల్లే పోలీసులు కాల్పులు జరిపి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.