
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకోవడమే గొప్ప విషయంగా ఫీలౌతూ ఉంటారు. అలాంటిది ఇతరుల గురించి ఆలోచించడం అనేది చాలా అరుదు. కానీ ఓ పోలీస్ మాత్రం చాలా మంచి హృదయంతో ఆలోచించాడు. రోడ్డు మీద రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తన వంతు కృషి చేశాడు. ఆ పోలీస్ అధికారి చేసిన పనికి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఆయనకు సలాం కొడుతున్నారు. ముంబయిలో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వైభవ్ పర్మార్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అందులో ముంబయి ట్రాఫిక్ పోలీసు.. చేతిలో ఇసుకు పట్టుకొని ఓ చోట విసురుతూ కనిపించాడు. అతను ఒక ఫ్లై ఓవర్ కింద వీధిలో ఇసుకను విస్తరిస్తున్నట్లు చూడవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తరచూ రోడ్లు బురదగా మారడం సహజం. అయితే, అలా బురదగా మారినప్పుడు రోడ్డు సహజంగానే జారుతెంది. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదాలతో చాలా మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. అందుకే దానిని నివరించేందుకు ఆయన ఆ ప్రాంతంలో ఇసుక చల్లడం గమనార్హం.
“ఈరోజు భాండప్ పంపింగ్ సిగ్నల్ వద్ద వర్షం కారణంగా చాలా బైక్‌లు జారిపోతున్నాయి, 1 ట్రాఫిక్ అధికారి అగ్నిమాపక దళానికి కాల్ చేసారు కానీ వేచి ఉండలేదు. ప్రయాణికుల భద్రత కోసం ఆయన స్వయంగా రోడ్డును ఇసుకతో కప్పారు. ఆ పోలీస్ కి సెల్యూట్" అని ఆ ఫోటోకి క్యాప్షన్ జత చేశారు.
ఈ పోస్ట్‌కు 58వేలకు పైగా వ్యూస్, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఆ పోలీస్ అధికారిపై అందరూ ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మరికొందరు నగరాన్ని నివసించడానికి గొప్ప ప్రదేశంగా ఉంచడానికి అలాంటి పోలీసులు ఎలా అవసరమో వ్రాసారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఈ పోలీస్ అధికారి హీరోగా మారిపోయాడు.