ఉదయాన్నే నిద్ర లేవలేదన్న కారణంతో ఓ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వాహకుడు అమానుషంగా వ్యవహరించాడు. 12మంది మైనర్ విద్యార్థులకు వేడి స్పూన్ తో వాతలు పెట్టాడు.
గుజరాత్ : గుజరాత్ లోని సబర్‌కాంత జిల్లాలో ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో అమానుష ఘటన వెలుగు చూసింది. పాఠశాల నిర్వాహకుడు 12 మంది మైనర్ విద్యార్థులకు వేడిస్పూన్ తో వాతలు పెట్టాడు. వారు చేసిన నేరమల్లా ఉదయం వేకువజామునే నిద్రలేవకపోవడమే. దీంతో వీరికి శిక్షగా వేడి స్టీల్ స్పూన్‌తో కాల్చినట్లు గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఖేరోజ్ పోలీస్ స్టేషన్‌లో నచికేత విద్యా సంస్థాన్ నిర్వాహకుడు రంజిత్ సోలంకిపై భారతీయ శిక్షాస్మృతి, జువెనైల్ జస్టిస్ చట్టం కింద దాడి, ఇతర నేరాల కేసు నమోదయ్యింది. బాధిత విద్యార్థుల్లోని.. ఓ పదేళ్ల విద్యార్థి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు అధికారి తెలిపారు.
చంద్రయాన్-3 : చంద్రుడిపై అద్భుతం.. విక్రమ్ ల్యాండర్ చుట్టూ ఎజెక్టా హాలో...
"దాదాపు రెండు నెలల క్రితం సోలంకిపై ఓ విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేశాడు. సోలంకి తన కొడుకుతోపాటు మరో 11 మంది విద్యార్థులను వేడి స్టీల్ స్పూన్‌తో వాతలు పెట్టినట్లు ఆరోపించారు. అతన్ని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది" అని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్మిత్ గోహిల్ తెలిపారు.
జిల్లాలోని పోషినా తాలూకాకు చెందిన సోలంకి ఖేద్‌బ్రహ్మ తాలూకాలోని ఖేరోజ్ గ్రామంలో 'నచికేత విద్యా సంస్థాన్' అనే రెసిడెన్షియల్ స్కూల్ ను నిర్వహిస్తున్నాడు. ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి కార్యాలయం జరిపిన సమాంతర విచారణలో ఇది పాఠశాల కాదని, విద్యార్థులకు ఉపనిషత్తులు, రామాయణం, వేదాలను బోధించడానికి ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్న హాస్టల్ సౌకర్యంతో కూడిన 'గురుకులం' అని తేలిందని అధికారులు తెలిపారు. ఇది రిజిస్ట్రర్ కాని సంస్థ అని కూడా తేలిందన్నారు.
రమాభాయ్ తరాల్ అనే వ్యక్తి ఫిర్యాదు ప్రకారం.. స్కూలు నిర్వాహకుడైన సోలంకి తన మైనర్ కొడుకుతో పాటు మరో 11 మంది విద్యార్థులను ఉదయం త్వరగా నిద్రలేవలేదని కాల్చాడు. 'నచికేత విద్యా సంస్థాన్' హాస్టల్ సదుపాయంతో కూడిన సాధారణ పాఠశాల అని, విద్యార్థులు పదోతరగతి వరకు చదువుకోవచ్చని, హాస్టల్ ఓ ఉండొచ్చని ట్రస్ట్ స్థానిక గిరిజనులను ఒప్పించిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
‘‘పాఠశాలలో విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని వారం రోజుల క్రితం ఒకరి నుంచి తెలుసుకున్నాను. అదెంతవరకు నిజమో తెలుసుకోవడానికి కొన్ని రోజుల క్రితం స్కూల్‌కి వెళ్లాను. నా కొడుకు కాళ్లపై కాలిన గాయాలు ఉన్నాయి. అయినా నాకేం చెప్పలేదు. ఏదో తెలియని భయంతో ఉన్నాడు. నేను తరచి, తరచి అడగగా.. రెండు నెలల క్రితం త్వరగా నిద్రలేవకపోవడంతో సోలంకి తనను కాల్చాడని నాకు చెప్పాడు" అని తరల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
"పొద్దున్నే నిద్రలేవలేదనే కారణంతో సోలంకి 12 మంది విద్యార్థులను ఒకరి తరువాత ఒకరిగా వేడి స్పూన్ తో కాల్చాడని విద్యార్థుల నుండి తెలుసుకున్నాం. భయంతో విద్యార్థులు ఇన్ని రోజులు వారి తల్లిదండ్రులతో ఏమీ చెప్పలేదు" అని తరల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.