
North Atlantic Treaty Organization : రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. రష్యా మొదలు పెట్టిన ఈ మిలిటరీ చర్య కారణంగా రెండు దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. ఇక రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురిని కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తీసుకువచ్చిన ఇంకా చాలా మంది అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు విద్యార్థులను సరిహద్దు దాటేందుకు భద్రతా బలగాలు అనుమతించకపోవడంతో ఆదివారం పోలాండ్, రొమేనియా సరిహద్దుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న బాలికలతో సహా 12 మంది హైదరాబాదీ విద్యార్థులను ఉక్రెయిన్‌లోని రొమేనియా సరిహద్దుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి డెబిట్ కార్డులను కూడా భద్రతా బలగాలు లాక్కున్నట్లు సమాచారం.
తెలుగు విద్యార్థులను సరిహద్దు దాటేందుకు భద్రతా బలగాలు అనుమతించకపోవడంతో ఆదివారం పోలాండ్, రొమేనియా సరిహద్దుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కనీసం ఎనిమిది మంది తెలుగు విద్యార్థులు పోలాండ్ సరిహద్దుకు చేరుకోగలిగారు, అయితే భద్రతా దళాలు వారిపై స్వల్ప లాఠీచార్జి చేసి ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చేలా చేశాయి. ఆదివారం ఉదయం నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పనిచేయడం లేదు. కాచిగూడకు చెందిన విశ్వనాథ్, తన కుమారుడు కునాల్ ఎంబీబీఎస్ చదువుతున్నాడని, రష్యా సైన్యం దాడితో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాడని తెలిపారు. 12 మంది హైదరాబాదీ విద్యార్థులు ఫ్లైట్ ఎక్కేందుకు రొమేనియా బోర్డర్‌కు వెళ్లారు. రోమేనియా సరిహద్దుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే భద్రతాదళాలు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నాయని, వారి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయడం లేదని, నా కొడుకు నాకు ఫోన్ చేసి చెప్పాడు. భద్రతా బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నాయి. రోమేనియా సరిహద్దుకు చేరుకోవడానికి అనుమతించలేదు. వారు గత రాత్రి ఆ ప్రదేశానికి చేరుకోవడానికి కనీసం 30 కిలోమీటర్లు నడిచారు” అని విశ్వనాథ్ చెప్పారు.
భద్రతా బలగాలు తమ డెబిట్ కార్డులను లాక్కున్నాయనీ, సరిహద్దు దాటేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని కోరినట్లు కునాల్ తెలిపారు. సహాయం కోసం ఎంబసీ అధికారి ఎవరూ అందుబాటులో లేరు. విద్యార్థులు కన్సల్టెన్సీ వ్యక్తులను కూడా సంప్రదించగా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని విశ్వనాథ్ తెలిపారు. అలాగే, శనివారం రాత్రి ఎనిమిది మంది విద్యార్థులు పోలిష్ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే భద్రతా బలగాలు విద్యార్థులపై లాఠీచార్జి చేసి ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చేలా చేశాయి. అత్తాపూర్‌కు చెందిన నాగేశ్వరరావు, అతని కుమార్తె రీనా మరియు ఆమె స్నేహితులు రొమేనియా సరిహద్దులో చిక్కుకుపోయారని చెప్పారు. "ఈ ప్రదేశంలో దాదాపు మైనస్ 5 డిగ్రీల సెల్సియస్ ఉంది. విద్యార్థులు తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నారు. రొమేనియా సరిహద్దును దాటడానికి సరైన అనుమతి లేఖలు పొందడానికి రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామని రీనా చెప్పారు" అని నాగేశ్వరరావు వెల్లడించారు.