
Project Cheetah: దేశంలో అంతరించిపోయిన చిరుతలను తిరిగి ప్రవేశపెట్టే చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం 'ప్రాజెక్టు చీతా'ను ప్రారంభించింది. ఈ క్రమంలోనే పలు దేశాలతో ఒప్పందం చేసుకుని మళ్లీ మన దేశానికి చిరుతలను తీసుకువస్తున్నది. ఈ ఒప్పందంలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు భారత గడ్డపై అడుగుపెట్టాయి. శనివారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు ఈ చిరుతలు చేరుకున్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా మొదట నమీబియాకు చెందిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు తీసుకువచ్చారు. ఇది జరిగిన ఐదు నెలల తర్వాత 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి ఈ పార్కుకు తీసుకొచ్చారు. ఐఏఎఫ్ సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం 12 చిరుతలతో మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ల్యాండ్ అయిందని అధికార వర్గాలు తెలిపాయి.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుండి 10 గంటల సుదీర్ఘ విమాన ప్రయాణం తర్వాత శనివారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గ్వాలియర్‌లో ల్యాండ్ అయింది. ఈ క్రమంలోనే కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్యను పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కృతజ్ఞతలు తెలిపారు.
దక్షిణాఫ్రికా నుండి వచ్చిన 12 చిరుతలకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి..
1. 12 చిరుతలను మత్తుమందు ఇచ్చి క్రేట్లలో ఎక్కించి జోహన్నెస్ బర్గ్ లోని ఓఆర్ తాంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన విమానంలోకి ఎక్కించారు.
2. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానం 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చింది. చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు తరలించారు.
3. రాబోయే దశాబ్దంలో దక్షిణాఫ్రికా భారతదేశానికి డజన్ల సంఖ్యలో చిరుతలను అందిస్తుందని ఒప్పందంలో పేర్కొంది. దానిలో భాగంగా ప్రస్తుతం 12 చిరుతలు అందించింది. అందులో ఏడు మగవి, ఐదు ఆడవి ఉన్నాయి.
4. ఆఫ్రికన్ చిరుతను పోలి ఉన్నప్పటికీ.. కొద్దిగా వేరుగా ఉండే ఒక ఉపజాతి, భూమిపై అత్యంత వేగవంతమైన భూ జంతువులైన చిరుతలు 1952 లో భారత ఉపఖండంలో అంతరించిపోయాయి.
5. భారత్ లో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడం కోసం ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను తీసుకువచ్చింది. దీనిలో భాగంగా పలు ఆఫ్రికా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికా, భారత్ ప్రభుత్వాలు పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
6. ఫిబ్రవరిలో 12 చిరుతలను దిగుమతి చేసుకున్న తరువాత, వచ్చే 8 నుండి 10 సంవత్సరాల వరకు ఏటా మరో 12 చిరుతలను బదిలీ చేయాలని యోచిస్తోంది. అటువంటి బదిలీలను తెలియజేయడానికి శాస్త్రీయ మదింపులు క్రమానుగతంగా చేపట్టబడతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
7. ఇదివరకు, 2022 సెప్టెంబర్ 17న ఆఫ్రికా దేశమైన నమీబియా నుంచి 8 చిరుతలను తీసుకొచ్చారు. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలన్నీ కునో నేషనల్ పార్క్ పరిసరాలకు బాగా అలవాటు పడ్డాయని డీజీ వైల్డ్ లైఫ్ ఎస్పీ యాదవ్ తెలిపారు. సాసా అనే చిరుత తప్ప అన్ని చిరుతలు బాగానే ఉన్నాయని పేర్కొన్నారు.
8. ప్రస్తుతం భారత్ కు తీసుకువచ్చిన మొత్తం 12 చిరుతలు అడవిలో జన్మించి, సింహాలు, చిరుతపులులు, హైనాలు-అడవి కుక్కలతో సహా పోటీపడి వేటాడే జంతువుల మధ్య పెరిగినవని అధికారులు తెలిపారు.
9. చిరుతలను ఫిండా గేమ్ రిజర్వ్ (3), త్స్వాలు కలహరి రిజర్వ్ (3), వాటర్బర్గ్ బయోస్పియర్ (3), క్వాండ్వే గేమ్ రిజర్వ్ (2), మాపేసు గేమ్ రిజర్వ్ (1) నుంచి తీసుకువచ్చారు. వాటి బదిలీ ఐయుసిఎన్ మార్గదర్శకాలకు అనుగుణంగా, అంతర్జాతీయ పశువైద్య ప్రమాణాలు, ప్రోటోకాల్ కు అనుగుణంగా ఉన్నాయి.
10. 'ఆఫ్రికన్ చీతా ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా' 2009 లో రూపొందించబడింది, కానీ ఇది దశాబ్దానికి పైగా కార్యరూపం దాల్చలేదు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 2021 నవంబర్ నాటికి కునోలో చిరుతను ప్రవేశపెట్టే ప్రణాళికకు ఎదురుదెబ్బ తగిలింది.