
మహారాష్ట్రలోని పూణెలో దారుణం చోటుచేసకుంది. ఓ ప్రైవేటు పాఠశాల టాయిలెట్‌లో 11 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పూణె శివాజినగర్ ప్రాంతంలోని పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చేపట్టామని వెల్లడించారు. ‘‘ఒక గుర్తుతెలియని వ్యక్తి బాలికను పాఠశాల ఆవరణలోని టాయిలెట్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక ఈ సంఘటన గురించి తన స్నేహితులకు సమాచారం ఇచ్చింది’’ అని సీనియర్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అనితా మోర్ తెలిపారు.
ఈ విషయం బాలిక స్నేహితులు స్కూల్ అధికారులు తెలియజేశారని.. ఆ తర్వాత స్కూల్ సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 376తో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు.
ఈ కేసుపై విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని గుర్తించేందుకు పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. ‘నిందితుడి అమ్మాయికి తెలియదు. మా బృందాలు ప్రస్తుతం నిందితుడిని గుర్తించడానికి.. అతడిని ట్రేస్ చేయడానికి సెక్యూరిటీ కెమెరా ఫుటేజీతో సహా వివిధ ఆధారాల పరంగా గాలింపు చేపట్టాయి’ అని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులు చెప్పారు.