
న్యూఢిల్లీ: వయసు 15 సంవత్సరాలు. ఓ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. కానీ, ఆసక్తి మాత్రం అనంతం. టెక్నాలజీ, లాంగ్వేజెస్, కోడింగ్‌లపై అమితమైన ప్రేమ. వాటిని తన వశం చేసుకోవడానికి వయసు అడ్డు కాదు అనుకున్నాడు. చిన్నప్పుడే తల్లి ల్యాప్‌టాప్‌లో వాటిని ఓ పట్టు పట్టాడు. పదుల సంఖ్యలో ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ పూర్తి చేశాడు. తల్లి సోషల్ మీడియా అకౌంట్‌లో అమెరికాలో నిర్వహిస్తున్న ఓ వెబ్ డెవలప్‌మెంట్ కాంపిటీషన్ చూశాడు. అందులో పాల్గొని కోడింగ్ ఇరగదీశాడు. ఇంకేం.. మనోడినే ఉద్యోగం వరించింది. రూ. 33 లక్షల అమెరికా ఉద్యోగం అది. కానీ, ఆ పిల్లాడి వయసు 15 సంవత్సరాలు అని తెలుసుకున్న అమెరికా కంపెనీ నివ్వెరపోయింది. మైనర్‌కు జాబ్ ఇవ్వడం ఎలా అని ఆలోచనలో పడింది. ఆ జాబ్ ఆఫర్ ఉపసంహరించుకుంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రాజేశ్, అశ్విని దియోకటే దంపతులు. వారిద్దరూ నాగ్‌పూర్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు. వారికి 15 ఏళ్ల వేదాంత్ దియోకటే అనే కుమారుడు ఉన్నాడు. వేదాంత్‌కు టెక్నాలజీపై ఎంతో ఆసక్తి ఉన్నది. అందుకే ఇంట్లో ఉన్న తల్లి ల్యాప్‌టాప్ ముందే ఎక్కువగా తచ్చాడుతుండేవాడు. ఆ ల్యాప్‌టాప్ చాలా స్లో. ఔట్‌డేటెడ్ అని కూడా చెప్పారు. అయినా దాన్ని పట్టుకునే వేళాడుతుండేవాడు. ఊరికే కాదు.. అందులో ఎన్నో ఆన్‌లైన్ ట్యూటోరియల్స్ వినేవాడు. టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండేవాడు. స్కిల్స్ పెంచుకునేవాడు. సొంతంగా కోడింగ్ నేర్చుకున్నాడు.
ఓ సారి తల్లి ఇన్‌స్టా అకౌంట్‌లో అమెరికాకు చెందిన ఓ కంపెనీ నిర్వహించ తలపెట్టిన వెబ్ డెవలప్‌మెంట్ కాంపిటీషన్ యాడ్ చూశాడు. దానికి అప్లై చేశాడు. ఆ కాంపిటీషన్‌లో పాల్గొని రెండు రోజుల కాలంలో 2,066 లైన్ల కోడ్ రాసి కాంపిటీషన్‌లో విజేతగా నిలిచాడు. ఆ కోడింగ్ పోటీలో సుమారు వేయి మంది పాల్గొన్నారు. ఈ పోటీలో గెలిచిన వేదాంత్‌కు అమెరికా కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. ఏడాదికి రూ. 33 లక్షల ప్యాకేజీ ఉన్నది. న్యూజెర్సీకి చెందిన అడ్వర్టైజింగ్ కంపెనీలో హెచ్‌ఆర్‌డీ టీమ్‌లో ఉద్యోగం కోసం ఆయన జాబ్ ఆఫర్ చేసింది. కానీ, వేదాంత్ వయసు 15 సంవత్సరాలే అని తెలిసింది. దీంతో ఆ కంపెనీ జాబ్ ఆఫ్ విత్‌డ్రా చేసుకుంది.
అయితే, ఈ ఆఫర్ వెనక్కి తీసుకోగానే ఓ ప్రోత్సాహకర సందేశం పంపింది. ఈ జాబ్ ఆఫర్ వెనక్కి తీసుకున్నందున బాధపడొద్దని, చదువు పూర్తి చేసిన తర్వాత తమ కంపెనీని సంప్రదించాలని వేదాంత్‌కు సూచించింది. వేదాంత్ ఎక్స్‌పీరియెన్స్, ప్రొఫెషనలిజం, అప్రోచ్‌లతో కంపెనీ ఎంతో ఇంప్రెస్ అయిందని ప్రశంసించింది.
వేదాంత్ తల్లితండ్రులు కూడా ఈ విషయం విని షాక్ అయ్యారు. వేదాంత్ స్కూల్ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, అప్పుడే తమకు వేదాంత్ పోటీలో గెలుపు గురించి తెలిసిందని తండ్రి తెలిపాడు. ఆ కంపెనీకి వేదాంత్ వివరాలను ఆ స్కూల్ యాజమాన్యమే పంపిందని వివరించాడు. తమ కొడుకు చిన్నతనంలో అంతటి విజయాన్ని సాధించడంపై తల్లిదండ్రులు ఖుషీ అవుతున్నారు. అంతేకాదు, వేదాంత్‌కు ఒక కొత్త ల్యాప్‌టాప్ కొనియ్యాలని ప్లాన్ చేస్తున్నారు.