మర్యాద లేదా: పినరయి విజయన్ పై మండిపడ్డ గవర్నర్ ఆరిఫ్

By telugu teamFirst Published Jan 16, 2020, 1:24 PM IST
Highlights

సిఏఏను వ్యతిరేకిస్తూ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ విరుచుకుపడ్డారు. గవర్నర్ నైన తన అనుమతి లేకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏను) సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఎక్కిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీద కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తీవ్రంగా మండిపడ్డారు. తన నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే కనీస మర్యాదను కూడా పాటించలేదని ఆయన ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. 

సీఏఏను సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీఏఏను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన మొదటి రాష్ట్రం కేరళ. రాష్ట్ర ప్రభుత్వ చర్య ప్రోటోకాల్ ను ఉల్లంఘించడమేనని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గురువారం ఉదయం అన్నారు. 

also Read: కేంద్రానికి షాక్: సీఏఏపై సుప్రీంకోర్టుకెక్కిన కేరళ సర్కార్

తాను ప్రభుత్వం తప్పు చేసిందని అనడం లేదని, సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ప్రభుత్వానికి ఉందని, అయితే తన నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, కనీసం తనకు సమాచారమైనా ఇవ్వాల్సి ఉండిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. 

గవర్నర్ అనుమతి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిచేయవచ్చునా, లేదా అనే విషయాన్ని తాను పరిశీలిస్తానని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో సవాల్ చేసిన విషయాన్ని రాజ్యాంగాధినేతను అయిన తాను వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

సీఏఏ రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు సంబంధించిన హక్కునే కాకుండా పలు ఇతర ఆర్టికల్స్ ను ఉల్లంఘిస్తోందని కేరళ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన లౌకికవాదానికి వ్యతిరేకంగా సీఏఏ ఉందని చెప్పింది. 

సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు 60 పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలను తీసుకుంటే కేరళ ఆ చట్టాన్ని సవాల్ చేసిన తొలి రాష్ట్రం. 

Also Read: ఔను, నేను పాకిస్తానీనే, ఏం చేసుకుంటారో చేసుకుండి: అధీర్ రంజన్ చౌధురి

సీఏఏపై కేరళ ప్రభుత్వ వైఖరిని గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ గతంలో కూడా తప్పు పట్టారు. పార్లమెంటు ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఖజానాలోని నిధులను ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం దినపత్రికల్లో ప్రకటనలు ఇస్తోందనే వార్తలపై స్పందిస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అలాంటి చర్యలకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. 

click me!