జగన్, కేసీఆర్ దూరమే: సోనియా నుంచి అందని ఆహ్వానం

By telugu teamFirst Published May 16, 2019, 7:49 AM IST
Highlights

కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలకు సోనియా నుంచి ఆహ్వానం అందనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. సమావేశానికి ఇంకా కొద్ది రోజులు ఉంది. అయితే, ఇప్పటి వరకు తమకు ఆహ్వానం అందలేదని టీఆర్ఎస్, వైసిపి నాయకులు అంటున్నారు. 

న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన యుపిఎ భాగస్వామ్య పార్టీలతో, ఎన్డీఎయేతర పార్టీలతో తలపెట్టిన సమావేశానికి హాజరు కాకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం లేదని సమాచారం. పైగా వారికి సోనియా నుంచి వ్యక్తిగతంగా ఆహ్వానం అందలేదని సమాచారం.

కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలకు సోనియా నుంచి ఆహ్వానం అందనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. సమావేశానికి ఇంకా కొద్ది రోజులు ఉంది. అయితే, ఇప్పటి వరకు తమకు ఆహ్వానం అందలేదని టీఆర్ఎస్, వైసిపి నాయకులు అంటున్నారు. సోనియా ఆహ్వానించినా కూడా సమావేశానికి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 

తమకు సోనియా నుంచి ఏ విధమైన ఆహ్వానం అందలేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. అయితే, ముఖ్యమైన నేతలకు ఆహ్వానాలు పంపించడం కాకుండా తానే వ్యక్తిగతంగా మాట్లాడాలని సోనియా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఆమె మంగళవారం మాట్లాడారు. 

సోనియా గాంధీ స్వయంగా ఆహ్వానించినా కూడా కేసీఆర్, జగన్ సమావేశానికి హాజరు కాకపోవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎను సమర్థించడం పట్ల ఇరువురికి కూడా కొన్ని అభ్యంతరాలున్నాయి. కేసీఆర్ ఇప్పటికీ కాంగ్రెసేతర, బిజెపియేతర కూటమి ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. 

కాగా, కాంగ్రెసు తప్పుడు కేసులు పెట్టించి, జగన్ ప్రతిష్టను దెబ్బ తీశారని, అటువంటప్పుడు సోనియా నిర్వహించే సమావేశానికి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు. ఏమైనా, ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాలని ఇరువురు నాయకులు కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

click me!