
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటించడకపోవడంపై కాంగ్రెసు ఈసిని తప్పు పడుతోంది. నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి, సంక్షేమ పథకాలను ప్రకటించడానికి వీలుగానే ఎన్నికల తేదీలను ప్రకటించడంలో ఈసీ జాప్యం చేస్తోందని కాంగ్రెసు విమర్శించింది. ఎన్నికల తేదీలు ప్రకటిస్తే ఎన్నికల నియామవళి అమలులోకి వచ్చి మోడీ ప్రకటనలకు వీలు కాదనే ఆ విధంగా చేస్తోందని అంటోంది.
వరుస ట్వీట్లతో కాంగ్రెసు సీనియర్ నేత అహ్మద్ పటేల్ మంగళవారంనాడు ఈసీపై విరుచుకపడ్డారు. చివరి నిమిషం వరకు ప్రభుత్వ నిధులను ప్రచారం కోసం వినియోగించుకునే వెసులుబాటు ఇస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అదే సమయంలో ఎన్నికల ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు.