తెలుగు సాహిత్యంలో ఆశారాజు కవిత్వానికి, ఆయన రాసే కవితలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. తెలుగులో సీనియర్ కవి అయిన ఆశారాజు తనదైన శైలిలో కవిత్వ ప్రక్రియలో ఓ ముద్ర వేశారు.
మొన్నటి ఉదయాలు కళ్లల్లో మెదిలాయి
నిన్నటి మధ్యాహాన్నాలు అలల్లా మెరిశాయి
సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయినట్టు
మా మధ్యలోకూర్చున్న మిత్రుడు,
పడవలా మునిగి పోయాడు
ఒక్కొక్కపేజీని వెనక్కి తిరిగేస్తే
ఎన్నెన్నో దృశ్యాలు
ఏరుకోలేని సరదాలు
కలలుంటాయని తెలియదు ---
మేమే కలలమనుకొనే బంధాలు
ఇప్పుడు డైరీని తెరిచిచూస్తే
కొన్నిచోట్ల నెత్తురుమరకలు
కొన్ని పేజీలమీద సీతాకోకచిలుకలు
చెమట బిందువులు రాలాయా
కన్నీళ్లు వొలికాయా
మనసంతా తడిసిపోయింది
ఒక్కొక్క పేజీ చిరిగిపోయి
జ్ఞాపకాలు ఎగిరిపోతున్నాయి
అన్నిటినీ మరిచిపోతున్నాము
గాయాలకు అలవాటుపడ్డాము
బాధలు మనలో భాగమైపోయాయి
ఇంట్లోంచి వస్తువులు పోయినాతెలియదు
పక్కన నడుస్తున్నమనిషి ,
అకస్మాత్తుగా ఆగిపోయింది కూడా స్పృహవుండదు
బాటలో అంతా శూన్యం
ఏకాంతంలో భయంకరమైన నిశ్శబ్దం
పసినవ్వులు వినిపిస్తే
ప్రాణాలు నిలుపుకోవచ్చునేమో!
పూచేపువ్వులను
నడిచే పిల్లలను తలుచుకుంటూసాగాలి
దూరాన ఎక్కడో మలుపువస్తుంది
వెనకవస్తున్న పిల్లలకు ,మనం కనిపించము
అటూ ఇటూ చూసి, వాళ్ళే ప్రపంచాన్ని నిర్మిస్తారు
మనంలేని లోటులేకుండా
వాళ్లే ఏడుగుర్రాల రథమెక్కి
వేడుక సృష్టిస్తారు
Also Read
తెలుగు కవిత: కోలిమికి భరోసా కావాలి
కొండపల్లి నీహారిణి తెలుగు కవిత: ఆకస్మికంగా...
పీటర్ హ్యాండ్కే కవిత: బాల్యపు గీతం.