ఆనందం నిష్క్రమించిన వేళ
ఈ నిర్ధయ వాచాలతపు తత్వంలో
త్రోసుకు పోయే రాసుకుపోయే
అనుభవాల గోడలు
గదులుగదులుగ ,ఇండ్ల సమూహాలుగ
దేశదేహాలుగ ,భూమాత గర్భాన ఆరు 
సంఖ్య నెత్తుకున్న ఆకారాలు
దేహాలు, దేహాలుగా
* * * *        
అంతర్మధన పరిష్వంగ  గాయాల సలపరింత ,కడతేర్చ లేని కోరికల
గుహలూ ,కుహరాలూ కన్నీటిసరస్సులో
తేలిపోనివ్వని అహంభావాదివికారాలూ
వస్తూ నే ఉంటయ్‌ .
మర్మ గర్భంగా నిన్ను తన వెంట
తమోరథాన్ని ఎక్కిస్తూనే ఉంటయ్‌
  ఎంతో కొంత అవాంఛిత విచలిత భావ చలనాన్ని  నువ్వు విసిరినా,కడవరకుఈదలేని కడలి గుంభనాన్ని, నీ నిర్‌దేహ ప్రయాణ బడలికవరకూ నువ్వుగా నీలోని నువ్వుగా నీతో నీ వాంఛలో వాంఛగా
ప్రశ్నించ లేని  ప్రశ్న వు గా కుత్తుక దాటాక,యవ్వనోద్రేక దగాకోరు  దోషాలకు జీవన భీభత్సాల్లో జీవన వైఫల్యాలలో నీకంటూ ఓ ఆత్మ గౌరవ ప్రాసాదపు ,అనుష్ఠించని సింహాసనపు,  అధిరోహించని అధికారపు స్వాధీనత ,పరస్పర ఆకార నిరాకారాల్లో  అస్పష్టతను గమనించ
ఓ వేగ కాంతిలా ......అలాగ ....అంతిమ వాంఛలల్లా .... ఆకస్మికంగా.....

- కొండపల్లి నీహారిణి