ప్రముఖ రచయిత్రి మెర్సీ మార్గరెట్ తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రాచుర్యం పొందారు. ఆమె విభా కవిత్వంపై సమీక్ష రాశారు. విభా కవిత్వంలోని విశేషాలను చదవండి.
1.
కలలకి ఖరీదు కట్టే కాలంలో ఉన్నాం మనం. మన కలల్ని కూడా పక్కదారి పట్టించి కలుషితం చేసే వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది తయారైయ్యారు. గత కొన్ని దశబ్ధాలుగా కలలంటే డబ్బు, హోదా , గొప్పతనం అనే మనకి నేర్పించబడుతుంది. తమలో ఉన్న విలువల్ని తామే గ్రహించకుండా .. ఉన్న విలువల్ని మర్చిపోయేలా చేస్తూ .. ఒక భ్రమపరిచే లోకంలోకి మనల్ని నెట్టే మనుషులు కోకొల్లలుగా తయారైయ్యారు. కలలే మనిషిని నడిపే చైతన్య చక్రాలు చలన సూత్రాలు అనే విషయం చాలా మందికి ఎరుక లేకుండా పోతుందన్నది కూడా వాస్తవం. ఆ కలలు అణచివేయబడుతున్న సందర్భాల వేదన ఆ ఆందోళన మనకి “విభా “ ప్రతి కవితలో కనిపిస్తుంది.
అందరూ కవులుగా కలకాలం బతకలేరు. బతికుండి కవులుగా గుర్తింపు పొందలేరు. అలాంటిది విభా చనిపోయాక మరెక్కువ మందికి అధ్బుతమైన కవయిత్రిగా పరిచయమైంది. తాను చనిపోయినా కవితలా జీవిస్తున్న కవయిత్రి విభా.
కలలకోసం .. స్వేచ్ఛ కోసం ఆమె పడే తపన... వాటి పట్ల ఆమెకున్న గౌరవం “విభా”రాసిన ప్రతి కవితలో మనం చదవొచ్చు. విభా అంటే కాంతి .. ఈ కవయిత్రి తన కవిత్వం ద్వారా స్వేచ్చాయుత ప్రపంచపు కాంతితో తన జీవితం నిండపోవాలని ఆశించిందని ఆమె కవితల ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు.
ప్రముఖ రచయిత్రి ఓల్గా గారు ముందు మాట రాస్తూ –“ప్రేమ స్త్రీలనెప్పటికీ స్వేచ్చాజీవులుగానూ, పరాధీనులుగాను కూడా మారుస్తున్న భావన. ప్రేమించటానికి ఆ ప్రేమ వ్యక్తీకరించటానికి మానసికమైన స్వేచ్ఛ ఉండాలి. ఆ మానసికమైన స్వేచ్ఛ ఎంతగా ఉంటే అంతగా ప్రేమ సారాన్ని అనుభవించగలుగుతారు. మానసిక ప్రపంచానికి సరిహద్దులు లేకుండా చేసి హాయిగా సహకరించగల స్వేచ్చనిస్తుంది ప్రేమ. ఆ ప్రేమను అనుభవించి పలవరించిన కవయిత్రులు తక్కువ మందే ఉంటారు. కారణం? స్వేచ్ఛ లేకపోవటమే కుటుంబపు , లోకపు సెన్సార్ షిప్ గురించి భయపడటమే .. విభా ఆ భయాలను దాటి స్వేచ్ఛాయతీరంలో అడుగుపెట్టింది. “ – అని అంటారు వోల్గా గారు. ఓల్గా గారన్నట్టే విభా స్వేచ్ఛాయుత తీరంలో అడుగుపెట్టిన కవయిత్రీ సున్నితమైన సునిషితమైన దృష్టికోణంతో తాను రాసిన కవితలే అందుకు నిదర్శనం.
Also Read: ఆప్యాయతల పాశబువ్వ ఈ "బంతిబువ్వ"
2.
ఇరవై ఆరేళ్ళ లేత వయసులోనే ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయిన “విభా “ అనేకమంది పాఠకులకు అభిమాన కన్నడ కవయిత్రి. తాను బ్రతికి ఉన్నన్ని రోజులు కవిత్వమే తన ఊపిరిగా ఉనికిగా బ్రతికింది. తండ్రి మరణం .. అక్క మరణం క్రుంగిపోయేలా చేసినా కవిత్వం రాయటం ఆపలేదు విభా. తన వివాహానంతరం కూడా కవిత్వాన్ని రాస్తూనే ఉంది. అయితే 2004 మార్చి ఇరవై ఒకటో తేదీన విభా మరణించింది. బాగలకోటెలోని ఒక ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన విభా ప్రసవించిన పదిహేనో రోజున అదే ఆసుపత్రిలో మరణించింది. చావుకి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తేలింది. కారణం ఏదైనప్పటికి విభా తన కవితల్లో అనుమానంగా చెప్పినట్లే చావు తనను ఈ లోకం నుంచి తీసుకెళ్ళి పోయింది. చావు మనల్ని విభా నుంచి వేరు చేశానని ఆనందించినా .. తన కవితలతో విభా మన మధ్య బ్రతికే ఉన్నదన్న విషయం చావును ఓడించినట్టే.
3.
“కలల కన్నీటి పాట “ అనే విభా కవితల సంకలనంలో 38 కవితలు ఉన్నాయి. ప్రతి కవిత సున్నితమైన భావజాలంతో మనసుని హత్తుకునేలా ఉంటాయి. ఇది మన భావన కూడా.. మనం “నేనూ చాలా సార్లు ఇలాగే అనుకున్నానే “ అన్న కవితలు కొన్ని అయితే.. తన జీవితంలోనుంచి ఎంతో సునిశితంగా పరిశీలించి తాత్వికతని జోడించి రాసిన కవితలు మనల్ని ఆ తాత్వికతను అర్ధం చేసుకునేలా ఆలోచింప చేస్తాయి.
“ విభా” కవిత్వాన్ని ఎంతగా ప్రేమించిందీ అంటే కవిత్వంతో తన అనుబంధాన్ని దాదాపూ నాలుగైదు కవితల్లో కవితనే అంశంగా తీసుకుని రాసేంత ..
-“ నేను బతుకుతున్నాను ఎన్నో శతాబ్ధాలనుండి , ఇదే వంటింట్లో .. ఇదే పొయ్యి సందులో ..” అంటూ తన స్త్రీ జీవితపు ఖైదీ తనాన్ని వ్యక్తపరుస్తూ నాలుగు గదుల గోడల మధ్య తాను స్త్రీగా ఉండిపోవాల్సిన కారణాల్ని పితృస్వామ్య భావజాలపు నీడల గురించి భయాన్నీ వ్యక్తం చేస్తుంది కవయిత్రి విభా .
కవిత –“ సిగ్గు “ లో కవిత శీర్షికకి తగ్గట్టే రజస్వల అయిన చిట్టితల్లీ తనకు ఎదురైయ్యే పరిస్థితులూ .. ఆ అమ్మాయి పెద్దదై పోవటాన్ని సమాజం ఎలా చిత్రిస్తుందనేది ఆ కవితలో రాస్తుంది విభా. కవిత అంతా కోట్ చేయ తగినదే. ఒక చిట్టి తల్లి అప్పటి వరకు తండ్రితో ఆడుకుంటూ అన్నతో ఆడుకుంటూ అక్క చెల్లెలతో ఆడుకునేది కాస్తా సిగ్గు బిడియం నేర్చుకుని ఒక మూలకి కూర్చుని పరిమితమైపోవటాన్ని కొత్తగా సిగ్గు నేర్చుకోవటాన్ని సున్నితంగా కవిత్వీకరిచింది విభా.
Also Read: ముగింపులేని వాక్యం"గా కొనసాగుతున్న కాసుల రవికుమార్ కవిత్వం
“ప్రాణం కొట్టుకునే చప్పుడు “ అనే కవితలో స్త్రీల intellectual పరిస్తితిని చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది విభా.. పురుషుడు.. ‘ తనకన్నా స్త్రీ సమర్ధురాలూ .. అన్నిటిలో యోగ్యురాలూ ’ అని తెలిస్తే తట్టుకోలేడు. అయితే స్త్రీ తనకొచ్చే ఎన్నో ప్రశ్నలు యుగ యుగాలుగా ఒకేలా ఉన్నా వాటికి సమాధానం తెలిసినా వాటి నుంచి బయట పడలేదు. వంద ప్రశ్నలున్నా స్త్రీలు ఏ ప్రశ్నని బయటకి ఆడగకుండా తన చుట్టూ ఎప్పుడు ఒక బంధనం ఉంటుంది. సమాధానాలు తెలిసినా తల్లి తన ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. స్త్రీల అందరి పరిస్తితి అలాగే ఉంటుందని కవయిత్రి గ్రహించింది. పుట్టుకనుంచి తాను పెరిగి పెద్దైయ్యే వరకు స్త్రీ జీవిత చక్రం అందరదీ ఒకేలా ఉండటం చూసి - “ అవునమ్మా మనం ఎక్కడో కాలు జారాము .. దేనినో దాచిపెట్ట బోయి పూర్తిగా నగ్నమయ్యాము . . అనుభవాలన్నీటిని దాఖలు చేయకుండా.. వేరే భ్రమలోనే బ్రతుకుతూ వచ్చేసాము ..” అంటూ తన వేదనని వ్యక్త పరిచింది కవయిత్రి విభా
“రా కవితా “ .. అనే కవిత ఎంత అధ్బుతమైన కవిత అంటే పచ్చి పచ్చిగా గుండెని చిన్ని పాదాలతో తొక్కేయగలదు. ఒకటికి రెండు సార్లు ఈ కవిత చదివాను. రాత్రి ఆకారంలా అస్పష్టం అని చెబుతూ కవితని ఎన్ని రకాలుగా పోల్చి రాసిందో విభా. కవిత గొణుక్కునే ముసలివాడి జబ్బు అంటుంది. తనేమో తీరానున్న మట్టి .. కవితనేమో అలల రాశి అంటుంది. అంతేనా కవిత లేత కుర్రాడి చెలియ అని కూడా అంటుంది. కవిత కోసం ఎంత తాపత్రయ పడిందంటే “వెలిగించిన దీపం కొండెక్కక మునుపే గాలి జోలపాడి నిద్రపుచ్చే మునుపే వచ్చేసేయ్” అంటూ.. ఒక్కొక్క పదంతో తన మనసుని కవితతో స్నానమాడనీమని వేడుకుంటుంది కవయిత్రి విభా. -“ ఈ రాత్రి నీ కవితలని ధ్యానిస్తూ నిద్రపోయాను.. కవిత వాస్తవాన్ని మించిన లోకమని చెప్పేవాళ్ళపై జాలివేసింది “ అంటూ ఈ చిన్ని కవితతో కవిత్వం అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పింది విభా.
“ పాత బట్టల మూట “ ఈ కవిత మొదటి సారి ఫేస్ బుక్ లో అజయ్ వర్మ పోస్టు చేసినప్పుడు చదివాను. ఎంత సున్నితమైన కవితో. ఇంటి వసారాలో బోర్లించిన కుండలపైనున్న పాత బట్టల మూటను విప్పి విభా ఒక్కొక్క పాత వస్త్రాన్ని తీసి చూసి తన జ్ఞాపకాలలోకి ఎలా వెళ్తుంది అన్నదే కవిత. – “ మనస్సులో ఇప్పటికీ మాసిన ముతక బట్టలు మాసిపోని ఎన్నో జ్ఞాపకాలు .. బతకడానికింత చాలు అనేంత ప్రేమ కట్టి ఉన్నది ఈ బట్టల మూటలో “ అంటూ మనల్ని జ్ఞాపకాలలో వెనక్కి తీసుకెళ్తుంది.
మనిషి అస్తిత్వం ప్రశ్నించబడుతుంది. మనిషిని మనిషి గుర్తించడం సహజంగా జరగకుండా మనిషి కనుక్కున్న విషయాలే మనిషిని నిరూపించుకోడానికి పరీక్ష కోసం నిలబడాల్సి వస్తుందన్న విషయాన్ని “ గురుతు “ అన్న కవితలో తెలియజేస్తుంది విభా. మనిషి కనుక్కున్న అక్షరాలే మనిషిని పరీక్షకోసం నిలబెట్టడం ఆశ్చర్య పడాల్సిన విషయమేగా ..
తనని తాను ఒక లోక నిందితురాలు అనుకుంటుంది విభా. పుట్టక ముందే కలలు బీరువాల పాలయ్యాయనీ జైలు గది నేస్తం అయ్యిందనీ అంటూ” శ్రేష్ట నారీ” అనే పట్టానికి ఆశపడలేదు. –“ వచ్చేశాను లోకం గీసిన గీతాలు దాటి.. ఎప్పటికీ ఎగిసి పడే .. అతని ప్రేమానురాగాల చెలిమి కోసం..” అంటూ తనకి నచ్చిన ప్రేమైక ప్రపంచంలో హద్దులే లేని తనదైన ప్రపంచాన్ని కలగంటుంది విభా.
“దోసిలో భూమి “ అనే కవిత మట్టి గురించి భూమి గురించి ఆర్ధతో రాసిన కవిత. –“ మమ్మల్ని తప్ప అందరినీ కాపాడే ఈ భూమికి ,వేరే రక్షకులే లేరు.. అందుకనే ఇప్పుడు మా దోసిలిలో ఉంది భూమి “ అంటూ భూమి మీద తనకున్న అపారమైన ప్రేమను గౌరవాన్ని నమ్మకాన్ని ఏ భేదాలు లేకుండా కాపాడే దాని ఔన్నత్యాన్ని శ్లాగిస్తుంది విభా.
జ్ఞాపకాలు విభా కవితలకు మూలాలు. తన జ్ఞాపకాల నిధి తవ్వుతూ కనిపిస్తుంది ప్రతి కవితలో విభా. –“ ఆ జ్ఞాపకాల నిధి తవ్వుతాను . ఆ తరువాత నేను అక్కడే మూతపడి పోతాను “ అంటుంది కవయిత్రి. -“ ఎదపళ్ళెం నిండా కలల నక్షత్రాలు .. వెలిగించిన వేల జ్ఞాపకాల దీపాలు “ అంటుంది
“కలల కన్నీటి పాట “ అనే కవితలో . ఈ కవిత శీర్షికే విభా కవిత్వ సంకలనం శీర్షిక కూడా. చాలా చిక్కటి కవిత. – “ ఈ సాయంత్రపు వెలుగు మీదొట్టు అంతా చెబుతున్నాను. అవును ఇప్పుడిలా అనిపిస్తుంది. నువ్వెప్పటికి నా కలల్లోనే ఉండిపో. నువ్వే కలవై పో .. ఈ చిట్టి ప్రమీదే సాక్షి – నీ నిరీక్షణలోనే నేను సజీవంగా మిగిలిపోతాను “ అని రాసుకున్న విభా తను యుద్ధం కోరుకోవటం లేదని ఈ కవిత ద్వారా చెబుతుంది. అది విజయమైనా ఆ విజయగర్వంతో తాను ప్రేయసిగా పాలు పంచుకోలేనంటుది. వందలాది నొసళ్లను బోడి చేసి వేలాది పసిపాపాలను అనాధలుగా మిగిల్చి తన నుదుటన కుంకుమ దిద్దను అంటుంది. అలా యుద్ధం చేసి సర్వం నాశనం చేసి అనేకుల ప్రాణాలను తీసిన వాడి ఛాతిపై తల పెట్టినా తనకి ప్రేమ బదులు .. ఆ ఛాతిలో ప్రవహించే రక్తం కాక అక్కడ ప్రవహించే బాధితుల కన్నీరునే చూస్తాను అంటుంది.
Also Read: ఖుల్లం ఖుల్లా"గా కవిత్వమవడం అతని నైజం
రామాయణంలో ఊర్మిళది ఒక దయనీయమైన పరిస్థితి. ఊర్మిళ అటు భర్తకి కాకుండా ఇటు తన జీవితానికి తానే కాకుండా నిద్రావస్థలో తన జీవితాన్ని గడిపేయడటం అనేది బాధామయ పరిస్తితి. ఒక స్త్రీగా ఊర్మిళ పరిస్తితిని అర్ధం చేసుకున్న విభా “ ఊర్మిళ స్వగతం “ అన్న కవిత రాసింది. చాలా చక్కటి చిక్కటి కవిత. ఒక స్త్రీగా ప్రేమని మించి ఆమె మాట్లాడుతుంది. తనని తానే కోల్పోయిన ఊర్మిళ మళ్ళీ పోగొట్టుకున్న తన కాలాన్ని పొందగలదా? తన గతంలోకి వెళ్లగళదా ? అని సందేహం వ్యక్తం చేస్తుంది.
“ఈ వేళ “ అనే కవిత చాలా చక్కటి కవిత. బావిలో పడ్డ చిన్న బిడ్డ గురించి పెట్టే పరుగూ .. తను అనుకున్న పాప ఆ పాప కాదు అని తెలిసి సంతోషాపడే మనస్తత్వం .. తన పరిమితులున్న ప్రేమను బట్టి కలవరపడటం .. స్వంతం చేసుకోలేని స్వార్ధమనసుని గట్టిగానే తన కవితలో తనని తాను ప్రశ్నించుకుంటూ మనల్ని ప్రశ్నిస్తుంది విభా.
మరో అధ్బుతమైన కవిత “వాళ్ళు “. తడిసిన అక్షరాలు .. కళ్ళలో నాటుకున్న కలలు .. మాసిపోయిన పేజీలలో బ్రతికే ఉన్న వాళ్ళు.. నానిన గోడకింద చిక్కుకుని ఊపిరాడక చనిపోయిన వారు.. అలా అక్షరాలలో బ్రతకుతూ అక్షరమై బ్రతికి అక్షరాలుగా చనిపోయే వాళ్ళ కోసం రాసిన కవిత. నేలకెంతో సహనం ఉంది ఆ సహనం ఎంత గొప్పదో రాస్తుంది. గోడకింద ఊపిరిఆడక చనిపోయిన వాళ్ళు నెలయిలీకలా మారి నీలం ఎరుపు నలుపు రంగులై ప్రతి పేజీ నడుమ ఏదో బొమ్మ గీసి మాయమైపోతారు అంటూ హద్దుల గురించి.. అక్షరాలు దాటే సరిహద్దుల గురించి.. నిర్వికార వానకున్న లక్ష్యం గురించి మాట్లాడుతుంది విభా.
దీపావళి పూట ఇంటి ఎదుట ఒకటే భక్తుల భజన .. బయట భక్తుల ఘోష విని కడుపులో బిడ్డ అడుగుతుంది .. ఏంటమ్మా ఈ చప్పుడు అనీ .. విభా అంటుంది - “ బయటికొచ్చే దాకా నిశ్చింతగా ఉండు తల్లి ఆ తరువాత జీవితాన్ని ఈ చప్పుళ్లతోనే గడపాలి” అంటూ “ చప్పుడు “ అనే కవితలో రాస్తుంది. యాదార్ధ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు అనుభవించి స్వీకరించిన విభా బయటికి పుట్టబోతున్న తన కూతురికి లోకం తీరు చెప్పే కవిత ఈ ప్రపంచం పోకడనూ .. దాన్ని ఎలా భరించాలి అన్న విషయాన్ని పుట్టకముందే తన కూతురికి నేర్పుతూ రాసిన కవిత మన అందరికీ వర్తిస్తుంది.
దోచుకున్న వారి గురించి .. దోచుకోబడ్డ వారిగురించి కూడా విభా కవిత రాసింది. దోచుకునే వారు కూడా దోచుకోబడతారు అంటూ –“ వాళ్ళు మన రాత్రి నిద్రని దోచుకున్నారు.. . మనలని నిద్ర పోనివ్వని వాళ్ళని ఆ నిద్రా హీనతరాత్రి నక్షత్రాలు .. మన తోడుంటాయి” అనే ఆశా భావాన్ని వ్యక్తం చేస్తుంది విభా . విభా తన ప్రతీ కవితలో ఏదో ఒక ఆశాభావం కనిపిస్తుంది.
కలలు లేని చోట నేను అస్సలు ఇమడలేను అనే విభా .. కల లేనిచోట కూడా కవితతో స్నేహం చేస్తుంది. కవితని తనలో మొలిపించుకుని ఎప్పుడూ కురిసే మబ్బు అయ్యింది . అలా మబ్బులా మారి కలలు లేని వారి కళ్ళలో కురుస్తాను అంటుంది. – “ రాత్రులలో కలలే లేవన్నవాళ్ళు ఒప్పుకోక తప్పదు నిన్ను ఎందుకో నేను వారి కళ్ళలో మెరుపుగా పరిశుభ్రపు వెలుగుగా మిగిలిపోతాను “ అంటుంది విభా. ఎన్నో ఆశలూ .. కలలూ ఉన్న వ్యక్తి విభ. “ నీ బాటకి నువ్వే వెలుగు” అని ఆశా పూరిత సమయాన్ని కాంక్షించింది. ఒక దారి లేకపోతే ఏంటి బోలెడు దారులున్నాయని అంటుంది. ఆశల అలతో కలలతో ఎగిసిపడుతుందీ అంటుంది తన కవిత “ నీ బాటకి నువ్వే వెలుగు “లో.
అద్భుతంగా రాసిన మరో కవిత “ కన్నీళ్ళు “ .. –“ ఆమె కళ్ళలో కలలుండేవీ ... వాటినంతా నా కళ్ళల్లోకి అనువాదించుకున్నాను .. ఇప్పుడు కన్నీటి ధార కురుస్తుంది. కలలన్నీటిని పోగొట్టుకుంటానేమో అని ఒకటే బెంగ నాకు “ అంటూనే – “ నువ్వు లేని వెలితిని ఎవరు నింపాలి ? ఆ నిష్కరుణ యముడైనా యోచించడెందుకు నా గురించి “ అంటుంది విభా. ఆనాటి కళ్ళలో నవ్వు ఉండేది ఇప్పుడు తెలియకుండ ఎదుస్తున్నాం అంటూ మారుతున్న కాలాన్ని నిందిస్తుంది.
Also Read: శ్రీరామోజు హరగోపాల్ కవిత: సంజీవి
4.
విభాకి ప్రేమ మీద విపరీతమైన గౌరవం. తన దృష్టిలో ప్రేమ అంటే ఏంటో చాలా స్పష్టంగా చాలా కవితల్లో మాట్లాడుతుంది. తన ప్రేమను ఎలాంటి హద్దులు లేకుండా వ్యక్తపరుస్తుంది. ఏకాంత సంధ్యలో చూరుకింద ఒకతే కూర్చున్నప్పుడు ఏకాంతానికి ప్రాణం పోసే అంత ప్రేమ కావాలని కోరుకుంటుంది విభా.
ఏ కల్మషాలు లేకుండా ప్రవహించే ప్రేమని ఎంతో సున్నితంగా మన ముందు నిలబెడుతుంది. తన కవితంతా ప్రేమే అని .. ప్రేమే తన కవిత్వమని చెప్పకనే చెబుతుంది. తను ప్రేమించిన ప్రేమ గురించి చెబుతూ –“ నేనిప్పుడూ ఊపిరి లేని జీవం .. నువ్వు లేకుండా నీ గుర్తులేవీ వద్దు. చివరికి నా జీవన ఊపిరి నీ పాట కూడా వద్దు” అంటుంది విభా. తన ప్రేమ ఖాళీ అవని కణజం.
“అతని కళ్ళలోనే నా ప్రయాణం పోయినా పరవాలేదు “ అనేంత హద్దు లేని ప్రేమ తనది. ప్రకృతి ఎంత దగ్గరగా ఉన్నా దాని స్పృహ లేదు ఊపిరికి ఊపిరి తాకెంత దగ్గరగా ఉన్నా చేరువ కాలేదు అంటూ .. “ గోడు “ అనే కవితలో రాస్తుంది. ఈ కవిత చాలా చిక్కటి కవిత. ప్రేమ ముందు యమున్ని కూడా ఒడిపోయేలా చేయగలను అన్న ధీమా ఉంది విభాకి అందుకే –“ మిగిలిన ఈ కొద్ది బతుకులో .. క్షణం క్షణం పూర్తిగా నిన్ను ప్రేమించాలని ఉంది.” అంటూ “ నా ప్రేమ ముందు ఆ యముడైన ఒడిపోయేలా నిన్ను ప్రేమించాలని ఉంది “ అంటూ తన ప్రేమని రుజువు చేసుకుంటానంటుంది.”
ఉదాసీన రాత్రి “అనే కవిత ప్రేమ గురించిన చాలా చిక్కటి కవిత. - “ప్రేమ కరగదు , తరగదు , ఎండిపోదు కానీ ప్రేమ నాకు అంతులేని వెతుకులాట “ అంటుంది విభా .
“కలలు “ అంటూ విభా రాసిన కలలు అన్నీ అధ్బుతం. ఒక్కో కల ఒక చిక్కటి కవిత ఒక కల – “ నువ్వు బ్రతికుంటే చనిపోయినవాళ్ళు గుర్తొస్తారు.. సమాధులు కన్నీరు తెప్పిస్తాయి. “
విభాకి అనాధాలపట్ల ఎంతో శ్రద్ధ ఉన్నట్లు తెలుస్తుంది తన కొన్ని కవితలు చదివితే – “ శిశువా , నువ్వు నాలో మొలకెత్తిన రోజు మిగలకూడదు లోకపు ఏ శిశువూ అనాధలా “ -అంటుంది కవయిత్రి.
4.
చీకటీ .. మౌనం .. కిటికీ.. ఆకాశం.. వెన్నెల.. రాత్రి.. వాన ..జ్ఞాపకాలు . కిటికీ.. కవిత .. దేహం .. ప్రాణం ఇలా ఇవన్నీ తన కవిత్వంలో కనిపిస్తాయి. జ్ఞాపకాలు విభా కవితలకు మూలాలు. తనకి బయట ప్రపంచానికి కిటికీనొకదాన్ని ఊహించుకుని కవిత్వం రాస్తుంది విభా. తన నుంచి తాను బయటికి లోపలికి వెళ్తూ ఆ ప్రకంపనలని ఆలోచనలని మనకి కవిత రూపంలో అందిస్తూ వెళ్ళినట్టు ఉంటుంది. తనని తాను ఎక్కడి లోతుల్లోకో తవ్వుకుంటూ వెళ్ళి రాసిన కవిత్వమే తన కవిత్వం అంతా.
చావుపట్ల విభాకి చాలా స్పష్టత ఉన్నట్టు తెలుస్తుంది. సమాధులను చూసి అనాధ గర్భాలను చూసి పాఠాలు నేర్చుకోమంటుంది. చీకటి వెలుగుల్ని జీవ మరణాలకు సాదృశ్యంగా తీసుకుని మాట్లాడుతుంది.
విభా చుట్టూ ఉన్న ప్రకృతిని పరిస్తితులను మనుషుల్ని ఎంత బాగా పరిశీలిస్తుందో మనం ఆమె చదివే ఆమె ప్రతీ కవితలో చూడొచ్చు . మనకి ఆమె ప్రతి కవితలో ప్రకృతితో ఆమె ఎంత మమైకం అవుతుందో తన కవితల ద్వారా తెలియజేస్తుంది . తను ఎంతో పరిశీలించి రాయటమే కాదు. ప్రతి కవితలో తనకి తోచిన తత్వాన్ని జోడిస్తుంది. ఆ తాత్వికత మనమూ ఒప్పుకునేలా కవిత్వీకరిస్తుంది. యాదార్ధ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు అనుభవించి స్వీకరించిన విభా.. లోకం తీరు చెబుతూ రాసిన కవితలు మన అందరికీ వర్తిస్తాయి.
కిటికీతో విభాకి చాలా ఎక్కువ సంబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. తనెప్పుడు గది లోపలి నుంచి గది అవతలి ప్రపంచాన్ని ఆ కిటికీలో నుంచే చూస్తూ అటువైపు ప్రపంచాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటుంది. తాను ఎప్పుడు తనని బందీ చేసిన పరిస్తితుల మూలాలను వెతుకుతున్నట్టు తోస్తుంది. అందుకే తనలా క్రుంగి కరిగే జీవాలు అనేకం ఆ కిటికీ అవతల చూసినప్పుడు కనిపిస్తున్నాయని తనలోని వేదనలకి సతమతం చేసే పరిస్తితులకు ప్రకృతి తన ఆవేదనలని గ్రహించి కొత్త రూపం ఇస్తూ కొత్త జీవాన్ని ఇచ్చే రాగాన్ని అద్బుతంగా ఆలపిస్తుంది అంటుంది విభా ..
మొత్తంగా విభా తమ ప్రేమించిన కవిత్వానికి తనని తాను ఇచ్చేచేసుకుని .. తానే అక్షరమై తడిచింది. పారే సెలయేరుల్లో కవిత్వమే పడవలా సాగిపోయింది. తను కోల్పోయిన వాళ్ళను లూటీ అయిన క్షణాలను కవిత్వ సాక్షిగా పూరించుకోవాలని అనుకుంది. ఈ కలల కన్నీటిపాట విభా పాట.
5.
అజయ్ వర్మ అల్లూరి ఈ కవిత్వాన్ని కన్నడ నుంచి తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం సైన్స్ పీజీ విద్యార్థి అయిన అజయ్ వర్మ సాహిత్యం మీద ప్రేమతో విభా కవితల వల్ల ప్రేరేపితుడై ఆమె కవిత్వాన్ని ఎంతో ప్రేమించి ఈ పుస్తకాన్ని తెలుగులోకి మనకి అందించాడు .. ఇంత చక్కటి కవిత్వాన్ని తెలుగులో మనకి అందించినందుకు అజయ్ వర్మకి కృతజ్ఞతలూ. అభినందనలు. మరింత మంచి కవిత్వాన్ని మనకి తెలుగులోకి అందించాలని కోరుతున్నాను.
- మెర్సీ మార్గరెట్