
భారతదేశంలోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత కీలక నిర్ణయాలలో ఒకటి సరైన విద్యా బోర్డును ఎంచుకోవడం. ఇది తల్లిదండ్రులకు చాలా క్లిష్టమైన పని, ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రధాన అంశం. CBSE, ICSE, రాష్ట్ర బోర్డులు, అంతర్జాతీయ బోర్డులు , ఓపెన్ స్కూలింగ్ వంటి చాలా ఆప్షన్స్ ఉండటంతో, ఏ బోర్డు ఉత్తమమో ఎంచుకోవడం ఒక సవాలుగా మారింది.మరి, ఏ బోర్ట్ ఎంచుకుంటే బెటర్ అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1. CBSE (Central Board of Secondary Education)
CBSE భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన విద్యా బోర్డుల్లో ఒకటి. ఇది దేశవ్యాప్తంగా సమానమైన పాఠ్యాంశాలను అందించడం వల్ల, తరచుగా మారుతూ ఉండే విద్యా విధానాలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే విద్యార్థులకు ఇది అనువైన బోర్డ్. సైన్స్, గణితం వంటి సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఎక్కువగా ఉంటుంది.
2.ICSE (Indian Certificate of Secondary Education)
ICSE బోర్డు సమతుల్య విద్యను ప్రోత్సహిస్తూ, భాషా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసేలా రూపొందించారు. ఈ బోర్డు విద్యార్థులకు అర్థవంతమైన విశ్లేషణాత్మక ఆలోచన నేర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు. సాహిత్యం, చరిత్ర, గణితం, సైన్స్, వంటి అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ఉంటాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో, విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.
3.State Board
ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేకమైన విద్యా బోర్డు ఉంటూ, ఆ రాష్ట్ర భాష, సంస్కృతి, చరిత్రకు ప్రాముఖ్యతనిస్తూ విద్యాబోధనను అందించడం రాష్ట్ర బోర్డుల లక్షణం. ఈ బోర్డులు స్థానిక విద్యార్థులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల విద్యా బోర్డుల నాణ్యత పరస్పరంగా తేడా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు, రాష్ట్ర స్థాయి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రాష్ట్ర బోర్డులు అనువైనవిగా ఉంటాయి.
అంతర్జాతీయ బోర్డులు (IB, IGCSE, A-Levels)
IB (International Baccalaureate), IGCSE (International General Certificate of Secondary Education), A-Levels వంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఆధారంగా విద్యను అందించే బోర్డులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే విద్యార్థులకు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థల్లో చదవాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక.
ఓపెన్ స్కూలింగ్ (NIOS – National Institute of Open Schooling)
సాంప్రదాయ విద్యా విధానంలో చదవలేని విద్యార్థులకు ఓపెన్ స్కూలింగ్ ఒక వరంగా మారింది. క్రీడాకారులు, కళాకారులు, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఇది అనువైన విద్యా విధానం.
సరైన విద్యా బోర్డు ఎంపిక విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే కీలక నిర్ణయం. CBSE పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సరైనదైతే, ICSE విశ్లేషణాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర బోర్డులు స్థానిక విద్యా అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించినప్పటికీ, అంతర్జాతీయ బోర్డులు గ్లోబల్ కెరీర్‌కు సిద్ధం చేసేలా ఉంటాయి. ఓపెన్ స్కూలింగ్ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అనువైనదిగా ఉంటుంది. పిల్లల ఆసక్తులు, భవిష్యత్ లక్ష్యాలు, కుటుంబ ఆర్థిక స్థితి ఆధారంగా సరైన బోర్డును ఎంచుకోవడం తల్లిదండ్రుల, విద్యార్థుల ముఖ్య బాధ్యత.