
Teachers Day 2023: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకునే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న టీచర్స్ డేను జరుపుకుంటారు. ఈయన 1962 నుంచి 1967 వరకు భారతదేశ రెండో రాష్ట్రపతిగా విధులు నిర్వహంచారు. ఈయన ప్రసిద్ద తత్వవేత్త, పండితుడు, రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు గొప్ప ఉపాధ్యాయుడు కూడా. ఈయన దేశ విద్యావిధానానికి, వ్యవస్థకు ఎంతో చేశారు.
ప్రముఖ విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5 న జన్మించారు. ఈయన విద్యను ఎంతో ప్రోత్సహించేవారు. అంతేకాదు ఈయన ప్రసిద్ధ దౌత్యవేత్త, పండితుడు, భారత రాష్ట్రపతి, అన్నింటికీ మించి ఒక గొప్ప ఉపాధ్యాయుడు కూడా. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు అతని పూర్వ శిష్యులు, స్నేహితులు కొందరు అతని పుట్టినరోజు సెలబ్రేషన్స్ తో ఉపాధ్యాయుడిగా అతను సాధించిన విజయాలను గౌరవించాలనుకున్నారు. అయితే తన జన్మదినాన్ని జరుపుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ దానికి బదులుగా సమాజంలో ఉపాధ్యాయుల విలువకు నివాళిగా ఈ రోజును జరుపుకోవడం సముచితమని డాక్టర్ రాధాకృష్ణన్ సూచించారట.యువత సన్మార్గంలో నడవడానికి, దేశ శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లడానికి విద్యావేత్తలు అవసరమని ఆయన భావించారు. దేశ భవిష్యత్తును ప్రభావితం చేయడంలో ఉపాధ్యాయుల నిబద్ధత, శ్రమ, కృషిని గుర్తించడానికి, గౌరవించడానికి భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇలా సృష్టించారు.
1965వ సంవత్సరంలో డాక్టర్ ఎస్.రాధాకృష్ణన్ ప్రసిద్ధ గురువుకు నివాళులు అర్పించేందుకు కొందరు ప్రముఖ విద్యార్థులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సభలో డాక్టర్ రాధాకృష్ణన్ తన ప్రసంగంలో.. తన జన్మదిన వేడుకల గురించి తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అలాగే భారతదేశం, బంగ్లాదేశ్ లోని గొప్ప గొప్ప ఉపాధ్యాయులకు నివాళులు అర్పించడం ద్వారా ఆయన జయంతిని 'ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకోవాలని నొక్కి చెప్పారట. దీంతో 1967 నుంచి నేటి వరకు సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం
ఈయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ రాధాకృష్ణన్ గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను చెప్పారు: "ఆయన అనేక హోదాల్లో తన దేశానికి సేవలందించారు. కానీ అన్నింటికీ మించి ఆయన గొప్ప గురువు, ఆయన నుంచి మనమందరం ఎంతో నేర్చుకున్నాం, నేర్చుకుంటూనే ఉంటాం. ఒక గొప్ప తత్వవేత్త, గొప్ప విద్యావేత్త, గొప్ప మానవతావాది రాష్ట్రపతిగా ఉండటం భారతదేశానికి దక్కిన ప్రత్యేక గౌరవం. అది మనం ఎలాంటి వ్యక్తులను గౌరవిస్తామో, గౌరవిస్తున్నామో తెలియజేస్తుంది' అని పేర్కొన్నారు.