వైరల్ వీడియోలో స్రవంతి ఒక యువకుడిపై సీరియస్ అవుతూ కనిపించింది. అస్సాంలో ఒక కార్యక్రమంలో అసభ్యంగా తాకడానికి ప్రయత్నించినందుకు ఆమె అలా చేసిందని నటి తెలిపింది.
స్రవంతి ఛటర్జీ అస్సాం, బెంగాల్లో పేరున్న నటి. ఆమెకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో కెమెరా, జనం గురించి పట్టించుకోకుండా ఒక యువకుడిపై హీరోయిన్ సీరియస్ అవుతూ పిడిగుద్దులు కురిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు? మరికొందరు హీరోయిన్ ఎందుకు అలా చేసిందని అడుగుతున్నారు? ఆమె ఎందుకు అంత కోపంగా ఉంది?
ఈ ప్రశ్నలన్నింటికీ హీరోయిన్ సమాధానం ఇచ్చింది. ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ అసలు విషయం చెప్పింది. ఈ ఘటన జరిగి 2 నెలలు అవుతుందని తెలిపింది. అస్సాంలో జరిగిన ఒక స్టేజ్ షోకి ఆమె వెళ్లింది. అక్కడ ప్రజలు ఆమెను చుట్టుముట్టారు. ఒక్కసారిగా గుంపులోంచి ఒక చేయి ఆమె వైపు వచ్చింది. అసభ్యంగా ఆమె ఛాతిని తాకడానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తం అయిన స్రవంతి తన రెండు చేతులు అడ్డం పెట్టుకుంది. అంతటితో ఆగలేదు. వెంటనే అతని చేయి పట్టుకుని లాగి కొట్టింది. ‘ఏం చేయమంటారు? నేను ముందు అమ్మాయిని, తర్వాతే సెలబ్రిటీని... నన్ను ఐదుగురు గుర్తిస్తారు, నాకే ఇలా జరిగితే, సాధారణ అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించుకోండి. అందుకే ప్రతిఘటించడం అవసరం. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే, నేను చేసినట్టుగా కొట్టండి’ అని ఇంటర్వ్యూలో చెప్పింది.