
అతిగా తినడం, తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని డాక్టర్లు, ఆరోగ్యనిపుణులు తరచుగా చెప్తుంటారు. తినడం సంగతి పక్కన పెడితే మందును మితిమీరి తాగేవారు చాలా మంది ఉన్నారు. అతిగా తాగితే లేని పోని రోగాలు వస్తాయి. ఒకేసారి 4 కంటే ఎక్కువ గ్లాసుల మందును తాగడాన్ని అతిగా తాగడం అంటారు. ఇది మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.
కొందరు వారమంతా బాగా కష్టపడి వీకెండ్స్ లో పార్టీ చేసుకుంటారు. పండుగ సీజన్ లో, వారాంతాల్లో తాగితే ఆరోగ్యం ఏం పాడుకాదని చాలా మంది అనుకుంటారు. కానీ వీకెండ్ లో అవసరానికి మించి అంటే అతిగా తాగితే ఎన్నో చర్మ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అతిగా తాగడం కూడా ఒక రకమైన వ్యసనమే. ఇది మీ ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకార.. అతిగా మందును తాగితే అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, జ్ఞాపకశక్తి, అభ్యాస సమస్యలతో పాటు లైంగిక సంక్రమణ వ్యాధులు కూడా వస్తాయి. దీనివల్ల మహిళల్లో అవాంఛిత గర్భం, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగితే ఎలాంటి చర్మ సమస్యలు వస్తాయంటే..
చర్మ నిర్జలీకరణానికి కారణమవుతుంది
మితిమీరిన మద్యపానం చర్మ నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీని వల్ల ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి. మందును తాగితే శరీరంలో యూరిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో మీరు తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల మీ శరీరంలోని నీరు, ఉప్పు సాధారణం కంటే ఎక్కువగా బయటకు పోతుంది. ఇదే స్కిన్ డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. పబ్ మెడ్ సెంట్రల్ పరిశోధన ప్రకారం.. చర్మం నిర్జలీకరణం, పొడి పెదవులు, పొడిబారిన చర్మం, నీరసమైన, నిర్జీవమైన చర్మం వంటి సమస్యలు వస్తాయి.
తక్కువ నిద్ర
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ అబ్యూస్ అండ్ ఆల్కహాలిజం ప్రకారం.. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల రాత్రిపూట ఎక్కువ మేల్కోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఆల్కహాల్ ను తాగితే వాళ్లు ఆలస్యంగా మేల్కొనడం లేదా అసలు నిద్రపోకపోవడం వంటి సమస్యలను ఫేస్ చేయొచ్చు. దీనివల్ల చర్మానికి మరమ్మతుకు సమయం లభించదు. దీంతో మీ మీ చర్మంపై అకాల ముడతలు కనిపిస్తాయి.
నల్లటి వలయాలు ఏర్పడతాయి
మితిమీరిన మద్యపానం నిద్రపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో మీరు రాత్రిళ్లు పదే పదే మేల్కొంటారు. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్ల వాపు వంటి సమస్యలు వస్తాయి.
సోరియాసిస్ ప్రమాదం ఉండొచ్చు
సోరియాసిస్ అనేది చర్మ సమస్య, దీనిలో చర్మం డ్రైగా ప్రారంభమవుతుంది. దీని వల్ల చర్మంపై మందపాటి పొలుసుల మచ్చలు ఏర్పడతాయి. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువసేపు ఎక్కువగా ఆల్కహాల్ ను తాగడం వల్ల సోరియాసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చర్మ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది
చాలా కాలంగా మోతాదుకు మించి ఆల్కహాల్ ను తాగడం లేదా వీకెండ్ లో లిమిట్ లేకుండా తాగితే మీకు చర్మ క్యాన్సర్ ప్రమాదం రెట్టింపు అవుతుంది. ఆల్కహాల్ మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది వ్యాధులతో పోరాడే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ సైన్స్ ప్రకారం.. ఆల్కహాల్ వినియోగం చర్మంపై పరోవైలేట్ కిరణాల ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది చర్మానికి సాధారణం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది.