
International Women's Day 2023: ఆడవారు బలహీనులు అనే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఆడవారంత బలవంతులు ఎవరూ లేరు. వారంత శక్తిమంతులు కూడా లేరు. వీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ప్రోత్సహించాలే కానీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి చూపిస్తారు. గృహిణిగా, టీచర్ గా, ఆర్థిక వేత్తగా, ఇంజనీర్ అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఈ ప్రపంచాన్ని గొప్పగా తీర్చిదిద్దుతున్నారు. తమ సత్తాను చాటుకుంటున్నారు. పితృస్వామ్య సంకెళ్లను తెంచి, సామాజిక అడ్డంకులను అధిగమించి ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నారు.
మహిళా దినోత్సవం ఎప్పుడు?
ప్రతిఏడాది మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే ఈ రోజును అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవం అని మొదట్లో పిలిచేవారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1900 దశకం నుంచే జరుపుకుంటున్నారు.
చరిత్ర
1908 లో స్త్రీల అణచివేత, అసమానతలపై ఎంతో చర్చ జరిగింది. తక్కువ పనిగంటలు, ఓటు హక్కు, మెరుగైన వేతనాలను కోరుతూ 15,000 మంది మహిళలు న్యూయార్క్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో 1909 లో యునైటెడ్ స్టేట్స్ అంతటా మొదటి మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1910 లో కోపెన్ హాగన్ లో శ్రామిక మహిళల అంతర్జాతీయ సదస్సు జరిగింది. జర్మనీలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ మహిళా క్యార్యాలయం నాయకురాలు క్లారా జెట్కిన్ దీనిని ప్రతిపాదించారు. 1911 మార్చి 19 న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913, 1914 మధ్య రష్యాలో మహిళలు మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 23న సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రపంచ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 న జరుపకుంటున్నారు. 1975 లో ఐక్యరాజ్యసమితి తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ ఒక్క దేశానికో, సమూహానికో, సంస్థకో ప్రత్యేమైందని కాదు. ఈ రోజు ప్రతి మహిళది. మహిళల విజయాలను గుర్తించి, సెలబ్రేట్ చేసుకుని వారి గౌరవాన్ని పెంచాలి. మహిళలకు దేనిలోనూ తక్కువ కాదు.