చాలా మంది ఇండ్లలో చెదలు ఉంటుంది. ఇది మన కంటికి కనిపించకుండా.. ఇంట్లో ఉన్న బుక్కులను, తలుపులు, దర్వాజలు, కిటికీలు వంటి చెక్కలను పనికిరాకుండాచేస్తుంది. మరి ఈ చెదలు ఇంట్లో లేకుండా పోవాలంటే ఏం చేయాలో తెలుసా?
చెద పురుగులు చూడటానికి చిన్నగానే ఉంటాయి. కానీ ఇవి కలిగించే నష్టం అంతా ఇంతా కాదు. తలుపులు, కిటికీలు, మంచాలను పనికి రాకుండా చేస్తాయి. ఇంతేనా చూడకుంటే.. ఇవి బుక్కులను కూడా పాడు చేస్తాయి. చెదల వల్ల ఇళ్లే దెబ్బతింటుంది. ఇది ఎన్ని మందులను వాడినా పోదు. ఈ చెద పురుగులు ఎక్కువగా చెక్క వస్తువులు ఉన్న ఇళ్లలోనే కనిపిస్తాయి. ఈ కలప తినే కీటకాలను చెక్క పురుగులు అంటారు. తడి ప్రదేశాల్లో, భూగర్భంలో నివసించే చెదపురుగులు కూడా ఉన్నాయి. ఈ భూగర్భ లేదా చెక్క చెదపురుగులు సాధారణంగా ఇళ్లను నాశనం చేసేస్తాయి.
మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నట్టైతే ఇంటిని కట్టే ముందు అంటే పునాది వేయడానికి ముందు మట్టికి చెదపురుగుల మందులను వేయాలి. ఒకవేళ మీరు చెదపురుగులు ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే కొన్ని చెదపురుగులను చంపే మందులు ఉన్నాయి. వాటిని పిచికారీ చేయొచ్చు. లేదా ఇంటి చిట్కాలతో కూడా మీ ఇంట్లో ఒక్క చెద పురుగు లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చెదపురుగులు సోకితే మీకు ఎలా తెలుస్తుంది?
చెదపురుగులను ఎలా గుర్తించాలి?
చెద పురుగులు తిన్న చోట ట్యూబ్ లాంటి పగుళ్లు ఏర్పడతాయి. అలాగే చెక్క ఫర్నిచర్ చుట్టూ తరచుగా రంపపు పొట్టు పేరుకుపోతుంటే కూడా అక్కడ చెద పురుగులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే గోడలలో పగుళ్లు, కిటికీలు లేదా తలుపులపై గీతలు, తడి వాసన చెదపురుగులకు కొన్ని సంకేతాలు.
వెనిగర్
వెనిగర్ చెదపురుగులను, కీటకాలను వెల్లగొట్టడానికి బాగా సహాయపడుతుంది. ఈ వెనిగర్ వాసన ఈ కీటకాలకు అలెర్జీని కలిగిస్తుంది. రెండు టీస్పూన్ల వెనిగర్ లో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి కలపండి. దీంట్లో అవసరమైనన్ని నీళ్లు పోయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చెదపురుగులు ఉన్న ప్రాంతాల్లో స్ప్రే చేయండి. చెదపురుగులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో ఇలా చేయడం వల్ల చెదపురుగులు పూర్తిగా తగ్గుతాయి.
లవంగాలు
లవంగాలు ఇంట్లో ఉన్న చెద పురుగులు, కీటకాలను చంపడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. లవంగాలను నేరుగా ఉపయోగించలేం. కాబట్టి రెండు టీస్పూన్ల లవంగాలను కొద్దిగా నీటిలో వేసి బాగా మరిగించండి. ఈ నీటిని చల్లార్చి స్ప్రే బాటిల్‌లో కలిపి చెదపురుగులు ఉన్న ప్రదేశాల్లో పిచికారీ చేయండి. చెదపురుగులను దూరంగా ఉంచడానికి ఈ హోం రెమెడీని తరచుగా ఉపయోగించండి.
సిట్రస్ ఎక్కువగా ఉండే నూనెలు
ఈ చెదను చంపడానికి సిట్రస్ ఎక్కువగా ఉండే నూనెలను కూడా ఉపయోగించొచ్చు. నారింజ, నిమ్మకాయల్లో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. స్టోర్లలో సిట్రస్ ఎక్కువగా ఉండే నూనెలు దొరుకుతాయి. చెద పురుగులను చంపడానికి ఇది బెస్ట్ చిట్కా. ఈ చెదపురుగులను సహజంగా చంపడానికి సిట్రస్ ఆయిల్‌ను నీటిలో కలిపి చెదపురుగులు ఉన్న ప్రదేశాలలో పిచికారీ చేయండి.
వేపనూనె
వేపనూనెతో కూడా మీరు చెదపురుగులను లేకుండా చేయొచ్చు. వేపనూనెలోని సువాసన ఈ చెదపురుగులను తరిమికొట్టడానికి సహాయపడుతుంది. ఇది చెదపురుగులను మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే కీటకాలు, దోమలను కూడా వెల్లగొట్టడానికి సహాయపడుతుంది. వేప నూనెను రసాయన రహిత సహజ పురుగుమందుగా ఉపయోగిస్తారు. కాబట్టి చెదపురుగులు కనిపిస్తే, వేపనూనెలో పలుచని గుడ్డను నానబెట్టి చెదపురుగులు ఉన్న చోట రాయాలి.