ఇంట్లో ఉన్న ఈగలు బయటకు పోవాలంటే ఏం చేయాలి?

By Shivaleela Rajamoni  |  First Published Jul 11, 2024, 2:07 PM IST

వర్షాకాలం మొదలైందంటే చాలు ఇంట్లోకి ఈగలు గుంపులు గుంపులుగా వస్తూనే ఉంటాయి. ఇక ఈ ఈగలు ఇల్లంతా తిరుగుతూ తినే ఆహారాలపై వాలుతుంటాయి. వీటిని తిన్న మనకు లేనిపోని రోగాలు వస్తాయి. అందుకే ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


వర్షాకాలం వానలతో పాటుగా ఎన్నో రోగాలు కూడా మనచుట్టూ తిరుగుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో మన ఇల్లు కాస్త ఈగల ఆవాసంగా మారుతుంది. ఈగలు ఎక్కడెక్కడో వాలొచ్చి మన ఇంట్లో ప్రతి దానిపై వాలుతుంటాయి. ఇది చిరాకు కలిగిస్తుంది. ముఖ్యంగా ఈగల వల్ల మనకు ఎన్నో రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇంట్లోకి  ఈగలు రాకుండా ఉండటానికి, ఇంట్లోకి వచ్చిన ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కర్పూరం పొగ: కర్పూరాన్ని ఎక్కువగా దేవుడి పూజలో ఉపయోగిస్తారు. కానీ మీరు కర్పూరాన్ని ఈగలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు తెలుసా? ఇంట్లో ఉన్న ఈగలు బయటకు పోవాలంటే ఒక చెంచాలో కర్పూరాన్ని కాల్చి దాని పొగను ఇంట్లో మొత్తం చూపించాలి. ఈ కర్పూరం వాసన ఈగలకు అస్సలు నచ్చదు. ఇంకేముంది ఇంట్లో ఒక్క ఈగ లేకుండా బయటకు పోతాయి. 

Latest Videos

ఆపిల్ సైడర్ వెనిగర్:  ఆపిల్ సైడర్ వెనిగర్ తో కూడా మీరు ఇంట్లో ఒక్క ఈగ లేకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్ తీసుకుని దానిలో నిళ్లు పోసి కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కలపండి. ఇప్పుడు దీన్ని మీ ఇంట్లోని ప్రతి భాగంలో స్ప్రే చేయండి. దీంతో ఇంట్లో ఒక్క ఈగ కూడా ఉండదు. 

ఉప్పు-నిమ్మకాయ: ఉప్పు, నిమ్మకాయ ద్రావణంతో కూడా మీరు ఇంట్లో ఉన్న ఈగలను తరిమికొట్టొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఉప్పు, ఒక నిమ్మకాయ రసాన్ని వేసి కలపండి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్ లో నింపి ఇంట్లో ఈగలు వాలే ప్రదేశాల్లో స్ప్రే చేయండి. 

బిర్యానీ ఆకుల పొగ:  బిర్యానీ ఆకులను వంటల్లోనే కాదు.. ఈగలను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించొచ్చు. అవును బిర్యానీ ఆకులతో ఇంట్లో ఒక్క ఈగ లేకుండా చేయొచ్చు. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో బిర్యానీ ఆకులను కాల్చి ఈగలు వచ్చే చోట ఉంచండి. ఈ పొగ ఇళ్లంతా వ్యాపించేలా చేయండి. దీనివల్ల ఇంట్లో ఒక్క ఈగ కూడా ఉండదు. 

దాల్చిన చెక్క:  దాల్చినచెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అంతేకాదు దీన్ని ఉపయోగించి ఇంట్లో ఈగలను కూడా బయటకు పోయేలా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే? దాల్చిన చెక్క ముక్కలను తీసుకుని ఇంట్లో ఎక్కడైతే ఈగలు ఎక్కువగా వాలుతాయో అక్కడ పెట్టండి. 

ఈ మొక్కలను ఇంట్లో నాటండి:  కొన్ని రకాల మొక్కలు కూడా మీ ఇంటికి ఈగలను దూరంగా ఉంచుతాయి. వర్షాకాలంలో ఈగలు మీ ఇంటికి దూరంగా ఉండటానికి.. పుదీనా లేదా లావెండర్ మొక్కను నాటండి. వీటిని ఇంటి కిటికీ దగ్గర ఉంచడం వల్ల ఇంట్లోకి ఈగలు రావు. 

ఫినాయిల్ మోప్: ఫినాయిల్ కూడా ఈగలు రాకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీ ఇంట్లో ఉన్న ఈగలు బయటకు పోవాలంటే ఫినాయిల్ కలిపిన నీళ్లతో ఇంటిని తుడవండి. దీని వాసనకు ఇంట్లో ఒక్క ఈగ లేకుండా పారిపోతాయి. .

click me!