
నాన్న.. ప్రేమకు ప్రతిరూపం.. అప్యాయతకు మారుపేరు. ఒకప్పుడు నాన్న అంటే దూరంనుండే దాక్కునే భయం.. కానీ ఇప్పుడు నాన్న అంటే మీసాలు పట్టుకుని ఆడుకునే చిలిపితనం.. అమ్మకంటే ఎక్కువగా చనువుగా ఉండే స్నేహితుడు. మారుతున్న కాలంతో పాటు నాన్నకు అర్థం మారిపోయింది.
నాన్నకూచీలుగా ఉన్న ఆడపిల్లలైనా సరే కొన్ని విషయాలు వచ్చేసరికి తల్లిదగ్గరే చెప్పుకోగలిగేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. తండ్రితో తల్లితో లాగానే అన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఆ స్పేస్ ను తండ్రులు తమ పిల్లలను ఇస్తున్నారు. అబ్బాయిలతో ఓ మంచి స్నేహితుడిలా కలిసిపోయి వారి భవిష్యత్తు భయాలను తొలగిస్తూ అందమైన బాటలు వేస్తున్నారు. మరి అలాంటి తండ్రులకు.. మీరు ఎంతగానో ప్రేమించే మీ అపురూపమైన నాన్నకు ఓ చిన్న బహుమతి ఇస్తే.. అది వారికి ఎంతో సంతోషపెడుతుంది. ఈ ఫాదర్స్ డే నాడు ఎలాంటి బహుమతి ఇవ్వాలో కొన్ని ఐడియాలు మీ కోసం..
ఇష్టమైన ఫుడ్..
మీ నాన్న కనుక మంచి భోజనప్రియుడైతే.. ఆయనకు బాగా నచ్చే.. రుచికరమైన ఫుడ్ ను ఈ రోజు స్పెషల్ గా తయారు చేయండి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నీ స్పెషల్ ఐటమ్స్ తో ఆయనను సర్ ఫ్రైజ్ చేయండి. ఇంకా వీలైతే స్వయంగా మీరే తయారు చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకవేళ అలా చేసినప్పుడు సరిగా కుదరకపోయినా.. మీరు ఎంతో ప్రేమతో చేశారు కాబట్టి.. ఆ ప్రేమ ముందు అన్నీ ఓడిపోతాయి.
ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే..
మీ నాన్న ఫిట్‌నెస్‌ను బాగా ఇష్టపడేవారు, ప్రతిరోజూ వర్కవుట్ చేయడానికి ఇష్టపడేవారు అయితే ఈ ఫాదర్స్ డే సందర్భంగా అతనికి ఫిట్‌నెస్ బ్యాండ్‌ను బహుమతిగా ఇవ్వండి. అప్పుడు వారి ముఖంలో కనిపించే ఆనందాన్ని చూడండి. ఫిట్‌నెస్ బ్యాండ్ మీ అడుగులు, హృదయ స్పందన, ఆక్సిజన్ స్థాయిలను కూడా ట్రాక్ చేయడానికి ఒక గొప్ప మార్గం. దీంతో పాటు మీ ఫాదర్ మార్నింగ్ వాక్‌లను మరింత హాయిగా, సరదాగా ఉండేలా చేయాలంటే మీరు తనకు ఒక జత వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.
జ్ఞాపకాల స్క్రాప్‌బుక్
బహుమతి విలువ ఖరీదుని బట్టి కాదు.. ఇచ్చే వ్యక్తిని.. అందులోని అంశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సారి మీనాన్నకిచ్చే బహుమతిని కాస్త ప్రత్యేకంగా ఆలోచించండి. ఒక స్క్రాప్ బుక్ తీసుకుని అందులో మీ నాన్నతో మీరు గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలు అతికిస్తూ.. వాటికి తగినట్టుగా చిన్న క్యాప్షన్స్ జోడించండి. ఫాదర్స్ డే నాడు గుడ్ మార్నింగ్ తో పాటూ ఇదీ తనకు అందించండి.
ప్రయాణాలంటే ఇష్టమా?
మీ నాన్న ప్రయాణం అనగానే ఎగిరి గంతేస్తారా? ఒకటి, రెండు రోజులు సెలవులు దొరికితే చాలు టూర్స్ అంటూ బయల్దేరతారా? అయితే అలాంటి నాన్నలకు టూర్స్ లో సౌకర్యంగా ఉండే వస్తువులు బహుమతిగా ఇవ్వడం వల్ల బాగా సంతోషిస్తారు. చక్కని బ్యాక్‌ప్యాక్, అందులో అవసరమైన అన్ని వస్తువులు ఇవ్వండి. మీ బడ్జెట్ అనుమతిస్తే, మంచి కెమెరాను కొనివ్వండి. పోలరాయిడ్ కెమెరాలు కూడా మంచి ఐడియానే. మరో ఐడియా వీకెండ్ ట్రిప్ బుక్ చేసి సర్ ఫ్రైజ్ చేయడం.
టెక్ సావీ నాన్నల కోసం...
మీ నాన్న టెక్ సావీ అయితే, అతను ఇష్టపడే వస్తువును కొనివ్వండి. హెడ్‌ఫోన్‌లు, మినీ ఫోటో ప్రింటర్, స్మార్ట్‌వాచ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ లేదా డ్రోన్ ఇలాంటివి. ఇంకా కాస్త బడ్జెట్ ఎక్కువుంటే థియేటర్ ప్రొజెక్టర్ కూడా ఇవ్వచ్చు. ఇది కుటుంబం మొత్తం కలిసి ఆనందించగలిగేది.
Wi-Fi సిస్టమ్, VR హెడ్‌సెట్, బ్లూటూత్ స్పీకర్లు లాంటివన్నీ టెక్-అవగాహన ఉన్న తండ్రికి గొప్ప బహుమతులు.