
ఇంట్లో అత్యంత శుభ్రంగా ఉంచుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశం బాత్రూమ్. కానీ.. మనం తరచుగా వాడటం వల్ల బాత్రూమ్ తొందరగా మురికి గా మారడంతో పాటు దుర్వాసన కూడా వస్తుంది. మరి, ఆ దుర్వాసన పోవడానికి చాలా మంది మార్కెట్లో లభించే చాలా రకాల కెమికల్స్ ఉండే లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి, కెమికల్స్ వాడకుండా.. బాత్రూమ్ దుర్వాసన పోగొట్టడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
1. బేకింగ్ సోడా:
బేకింగ్ సోడా బాత్రూమ్ లో దుర్వాసనను పొగొట్టడానికి సహాయపడుతుంది. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా పోసి బాత్రూంలో కిటికీ దగ్గర ఉంచండి. వారానికి ఒక్కసారి సోడాను మార్చండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన మొత్తం బేకింగ్ సోడా పీల్చుకుంటుంది.
2. నిమ్మకాయ:
నిమ్మకాయలోని సిట్రస్ వాసన బాత్రూం దుర్వాసనను పూర్తిగా పోగొడుతుంది. దానికి మీరు నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసుకుని బాత్రూం గోడలపై స్ప్రే చేయడం వల్ల దాని దుర్వాసన పోతుంది.
3. పుదీనా లేదా లవంగాలు:
పుదీనా ఆకులు లేదా లవంగాలు పొడి చేసి చిన్న గిన్నెలో వేసి ఉంచండి. ఇవి మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా, చిన్నచిన్న కీటకాలను కూడా దూరం చేస్తాయి.
4. కమలా తొక్కలు:
వాడిన కమలా తొక్కలను ఎండబెట్టిన తర్వాత ఒక జారీ బ్యాగులో వేసి బాత్రూంలో వేలాడదీయండి. ఇవి సహజ సువాసనను ఇస్తాయి, ఫ్రెష్ ఫీలింగ్ కలుగజేస్తాయి.
5. టీ బ్యాగులు:
వాడిన టీ బ్యాగులను ఎండబెట్టి, కొద్దిగా నూనెతో కలిపి గాజు సీసాలో ఉంచండి. టీ లోని సహజ వాసనలు బాత్రూం లోని బాక్టీరియా వాసనను తగ్గించడంలో సహాయపడతాయి.
6. ఈ టిప్ కూడా ట్రై చేయండి:
విక్స్ (Vicks) లాంటి బామును ఓ మూల కాగితం ముక్కపై వేసి బాత్రూంలో ఉంచితే గాఢమైన మెంటాల్ వాసన తో దుర్వాసన తగ్గిపోతుంది.
బాత్రూంను శుభ్రంగా ఉంచుకోవడం కోసం వారానికి కనీసం రెండు సార్లు ఫ్లోర్ క్లీనర్ ఉపయోగించి మాఫ్ చేయండి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ వాడడం వల్ల గాలి సరిగా మారి, దుర్వాసన సమస్య తగ్గుతుంది.